రేపు బీజేపీ అగ్రనేతలను కలుస్తా: పురందేశ్వరి
తాను బీజేపీలో చేరుతున్నట్లు కేంద్ర మంత్రి పురందేశ్వరి చెప్పకనే చెప్పారు. విశాఖపట్నంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం తాను ఢిల్లీ వెళ్లి అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి సీనియర్ నాయకులను కలుస్తానని తెలిపారు. ఇది చాలా బాధాకరమైన నిర్ణయమని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. బీజేపీలో చేరడానికి తాను ఎలాంటి షరతులు పెట్టడంలేదని అన్నారు.
కేంద్ర మంత్రులుగా ఉన్న తమను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజనను చాలా అన్యాయమైన పద్ధతుల్లో చేశారని, సీమాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆమె కాంగ్రెస్ అధిష్ఠానంపై మండిపడ్డారు. తాము ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. విభజన విషయంలో జరిగిన పరిణామాలు తనను చాలా బాధపెట్టాయన్నారు. ఈ ఐదేళ్లలో తనను కేవలం ఒక ఎంపీగానే కాకుండా.. సొంత బంధువులా ఆదరించారని, ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్లందరితో మంచి బంధుత్వం ఏర్పడిందని ఆమె చెప్పారు. వాళ్లందరినీ సమావేశపరిచి వాళ్లకు విషయాలు చెప్పి, మార్గదర్శనం చేయమన్నానని, వారిలో చాలామంది అభిప్రాయాలు వ్యక్తపరిచారని తెలిపారు. ఈ నెలరోజుల నుంచి తమ కుటుంబ సభ్యులు, దగ్గరవాళ్లు అందరూకూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారని అన్నారు. పదేళ్లు చేశాం కాబట్టి, ఇక అసలు రాజకీయాలే వద్దనుకున్నానని, అయితే.. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నందున రాజకీయాల్లో కొనసాగాలని వాళ్లంతా చెప్పారన్నారు.
అందుకే తాను ఇక తుది నిర్ణయం తీసుకున్నానని, ముందుగా ఆ నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు, నాయకులతో్ పంచుకోడానికి ఇక్కడకు వచ్చానని పురందేశ్వరి తెలిపారు. ఇది అవకాశం వాదం అని కొందరు అనుకోవచ్చుగానీ, అదిమాత్రం కాదన్నారు. తనతో రావాల్సిందిగా నాయకులెవరినీ ఒత్తిడి చేయలేదని, వారి ఆలోచనకే ఆ అంశాన్ని వదిలేశానని తెలిపారు. తన నిర్ణయం సరైనదో కాదో ప్రజలే తేలుస్తారని, ఎన్నికల ఫలితాలతో ఆ విషయం వెల్లడవుతుందని అన్నారు. ఇంతకుముందు తాను ఏ పార్టీ నాయకులనూ సంప్రదించలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై పురందేశ్వరి దంపతులు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో వాళ్లు గురువారం విశాఖలోని పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితులతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడే విషయంపై వారు మంతనాలు జరిపారు. గత అయిదేళ్లుగా తమతో ఉన్న కొద్దిమంది నేతలతో దగ్గుబాటి దంపతులు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. తమ అనుచరులతో పాటు ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులతో ఈ సమావేశం నిర్వహించారు. బీజేపీలోకి వెళ్లాలన్న తమ ఆలోచనను ప్రస్తావించగా, ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ విజయప్రసాద్, ద్రోణం రాజు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, అందువల్ల పార్టీ మారాలన్న అభిప్రాయాన్ని దగ్గుబాటి దంపతులు వెల్లడించినట్లు వారి సన్నిహితవర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్ర విభజన విషయంలో తమ వాదనలను కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోమని ఆ లేఖలో పేర్కొన్నారు కూడా. ఇక రాజ్యసభ ఎన్నికల్లో పురందేశ్వరి భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నిర్దేశించిన అభ్యర్థి కేవీపీ రామచంద్రరావుకు ఓటు వేయలేదు.