విభజనతోనే సమన్యాయం | Will not accept another state of Hyderabad in Telangana | Sakshi
Sakshi News home page

విభజనతోనే సమన్యాయం

Published Sun, Sep 22 2013 2:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Will not accept another state of Hyderabad in Telangana

మహేశ్వరం, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, విభజనతోనే రెండు ప్రాంతాలవారికి సమన్యాయం జరుగుతుందని బీజేపీ నేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం సాయంత్రం మండల పరిధిలోని పెండ్యాల పంచాయతీ అనుబంధ గ్రామం డబీల్‌గూడలో స్థానిక శివాజీ యూత్‌అసోసియేషన్ ఆధ్వర్యంలో  వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ధూంధాం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగం జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజనతోనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్రం  ప్రభుత్వం నుంచి  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీడబ్ల్యూసీ తీర్మానం చేసి 54 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రక్రియపై కదలిక లేదని పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి  ఆమోదించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణలో సీమాంధ్రకు  హైదరాబాద్‌ను తాత్కాలిక  రాజధానిగా మాత్రమే అంగీకరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, హక్కులపై సీమాంధ్ర పాలకులు చేసే దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.  
 
 తమ పోరాటం ప్రభుత్వాలపైనే తప్ప సీమాంధ్ర ప్రజలపైన కాదన్నారు. సీఎం తెలంగాణ వారిపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీమాంధ్రలో అప్రజాస్వామిక ఉద్యమాలను నిలిపివేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వర కూ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. తెలంగాణ కోసం తాము తన్నులు తింటుంటే అంతా అయిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకొంటున్నారంటూ మండిపడ్డారు. సీమాంధ్ర నేతలు, ప్రభుత్వ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఉద్యమంలో విజయం సాధించే వరకు వెనుకడుగు వేసేదిలేదన్నారు. ధూంధాం కార్యక్రమంలో తెలంగాణ ఆటపాటలతో కళాకారులు ఆలరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి. నర్సింహారెడ్డి, పెండ్యాల సర్పంచ్ మహేశ్వరి, నాగారం సర్పంచ్ వెంకటేష్, నాయకులు సుధాకర్ శర్మ, పాపయ్యగౌడ్, యాదయ్య, యాదీష్, శంకర్,ఈశ్వర్, యాదయ్య, శివాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement