నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదు: దిగ్విజయ్
సీడబ్ల్యుసీ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీని ఏర్పాటుచేసింది రాష్ట్ర విభజనపై సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడానికి కాదని, కేవలం రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యల గురించి తెలుసుకోడానికి మాత్రమేనని ఆయన తెలిపారు. గురువారం జరిగే కేబినెట్ సమావేశం ముందుకు తెలంగాణ నోట్ వస్తుందో రాదో తనకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ నోట్ అంశం కేంద్రం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీలనూ సంప్రదించిన తర్వాత మాత్రమే విభజనకు అనుకూలంగా తాము నిర్ణయం తీసుకున్నామని, అలాగే తెలంగాణ.. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులంతా అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని గతంలో చెప్పారు కాబట్టి వాళ్లు అలాగే అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ అన్నారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, దాన్ని రాష్ట్రపతికి పంపిన తర్వాత మాత్రమే రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.