'మోడీ వ్యాఖ్యలు ద్వంద్వ ప్రమాణానికి నిదర్శనం'
హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన 'నవభారత యువభేరి' సభలో తెలంగాణ అంశంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తప్పుబట్టారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ‘‘తెలంగాణవాసులు, సీమాంధ్రులు సోదరులు. అదేవిధంగా మెలగాలి. అన్నదమ్ములు ద్వేషించుకోవద్దు. ఆంధ్రా ఎంతో తెలంగాణ కూడా అంతే’’ అని నరేంద్రమోడీ ఆదివారం నాటి సభలో చెప్పిన విషయం తెలిసిందే.
పదే పదే తాము తెలంగాణకు అనుకూలమని బీజేపీ ఇప్పుడు చెబుతోందని, కానీ గతంలో బీజేపీ సీనియర్ నేత అద్వానీని ఎంపీ నరేంద్ర కలిసినప్పుడు తెలంగాణ ప్రసక్తే లేదని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ కొంతకాలం తర్వాత తెలంగాణకు అనుకూలమని చెప్పారని అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎప్పుడూ వాస్తవాల ఆధారంగా మాట్లాడరని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న డిమాండ్తో సోమవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను ఏపీ ఎన్జీఓలు విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మెల వల్ల వచ్చేదేమీ ఉండదని, చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపారు. ఏపీ ఎన్జీఓలను చర్చల కోసం ఢిల్లీకి ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ఈరోజు గానీ, రేపు గానీ రాత్రి 8 గంటల తర్వాత వారితో చర్చిస్తామని వివరించారు.