సమైక్యాంధ్ర కోసం ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఏపీ ఎన్జీవోలు బుధవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెలలో హైదరాబాద్లో భారీ సమైక్య బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలోని ముఖ్యనేతలతో సమావేశం కానున్నట్లు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.
ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెను విరమించేందుకు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో భేటీ అయింది. అటు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం రాజనర్సింహ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలతోపాటు ఇటు ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవోలు, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు పోరం ప్రతినిధులు ఆ భేటీకి హాజరయ్యారు.
అయితే సచివాలయంలో భేటీ జరుగుతున్న సమావేశం హాలు ముందు సీమాంధ్ర ఉద్యోగులు బైఠాయించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.