కరెంటు లేని ప్రాంతాలకు సోలార్ లాంతర్లు
హుదూద్ తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో దీపావళి పండుగ లోగానే 90 శాతం వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అయినా దీపావళి రోజుకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని, అలాంటి ప్రాంతాలకు కూడా వెలుగులు అందించేందుకు తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఏయే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదో, అక్కడ నెడ్క్యాప్ ద్వారా పదివేల సోలార్ లాంతర్లు అందిస్తామని అజయ్ జైన్ వివరించారు. కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసులను అందించే విషయంలో సిబ్బంది ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.