మద్యంపై యుద్ధం | Wine Shops Removed in Proddaturu Kadapa | Sakshi
Sakshi News home page

మద్యంపై యుద్ధం

Published Mon, Oct 14 2019 12:13 PM | Last Updated on Mon, Oct 14 2019 12:13 PM

Wine Shops Removed in Proddaturu Kadapa - Sakshi

మద్యం షాపులను తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేసిన 48 గంటల దీక్షను విరమింపజేస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి (ఫైల్‌)

అక్కచెల్లెమ్మల సంతోషం కోసం నివాస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి యుద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 48 గంటలపాటు దీక్ష చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. అయినా ఎమ్మెల్యే తన నిర్ణయాన్ని మార్చుకోకుండా వైఎస్సార్‌సీసీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిశగా అడుగులు వేశారు. తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. ఎమ్మెల్యే నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లోని మహిళలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాల నేతలు సైతం ఎమ్మెల్యే తీరును స్వయంగా ప్రశంసించారు.  

ప్రొద్దుటూరు : నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మద్యం షాపులను తొలగించడం మహిళలకు ఎంతో ఊరట కలిగించింది. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం కలిసి వచ్చింది. ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో సాయిబాబా ఆలయానికి ఇరువైపులా చాలా కాలం నుంచి ఐదు మద్యం షాపులు నడిచేవి. ఇక్కడ ఉన్న ఓ మద్యం షాపు టెండర్‌ జిల్లాలోనే అత్యధికంగా రూ.కోటి పలికిన సందర్భాలు ఉన్నాయి. మద్యం షాపుల మధ్యలోనే సాయిబాబా ఆలయం ఉండటంతో వసంతపేట మున్సిపల్‌ హైస్కూల్, చుట్టూ పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో, ఆదివారాల్లో మద్యం ప్రియుల ధాటికి తట్టుకోలేక మహిళలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రోజురోజుకు సమస్య తీవ్రతరమైంది. 

48 గంటలకు దీక్ష చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
 వరుసగా ఉన్న ఈ మద్యం షాపులను ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 2017లో 48 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. అప్పట్లో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్వయంగా వచ్చి ఎమ్మెల్యే చేత దీక్షను విరమింపజేశారు. ఆ సందర్భంగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు హామీ ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే రాచమల్లు తిరిగి ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సీఐ సీతారామిరెడ్డి, ఎస్‌ఐ కల్యాణ్‌తో కలసి నివాస ప్రాంతాల్లోని మద్యం షాపులను పరిశీలించి ఆయా ప్రాంతాల్లోని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామేశ్వరం రోడ్డుతోపాటు ఆర్ట్స్‌కాలేజీ నాలుగు రోడ్ల కూడలి, వైఎంఆర్‌ కాలనీ ఎంట్రెన్స్‌ వద్ద ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పలువురు మద్యం షాపులు తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఎమ్మెల్యే సూచన మేరకు రామేశ్వరంలోని నాలుగు, ఆర్ట్స్‌కాలేజీ నాలుగు రోడ్డు కూడలి, వైఎంఆర్‌ కాలనీ వద్ద ఉన్న మద్యం షాపులను ఈనెల 1వ తేదీ తొలగించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులను నియంత్రించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏటా 20 శాతం మద్యం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించడం ఎమ్మెల్యేకు కలిసి వచ్చింది. . 

ఎమ్మెల్యేను అభినందించిన ప్రజా సంఘాలు
 గతంలో మద్యం షాపులను తొలగించాలని ఆందోళన చేయడంతోపాటు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా నివాస ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా సంఘాలు హర్షిస్తున్నాయి. సంఘాల నేతలు ఆగస్టు 18న స్థానిక ఎన్జీఓ హోంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే రాచమల్లు ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, విరసం నేత వరలక్ష్మి, సీపీఐ, సీపీఎం నేతలు సుబ్బరాయుడు, సత్యం, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, జమా అతె ఇస్లామి హింద్‌ అధ్యక్షుడు మహబూబ్‌ఖాన్‌ తదితరులు ఎమ్మెల్యేను అభినందించిన వారిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement