అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడిపంటలకు నెలవు కావాలని, శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రం వర్థిల్లాలని, పల్లెలు మళ్లీ కళకళలాడాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
పల్లెలు మళ్లీ కళకళలాడాలి
ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడిపంటలకు నెలవు కావాలని, శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రం వర్థిల్లాలని, పల్లెలు మళ్లీ కళకళలాడాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. భోగి, మకర సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలకు అండదండగా నిలిచే వ్యవసాయాన్ని పండుగ చేసే విధానాలకు మరోసారి జయం కలగాలని అభిలషించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగాలని.. ప్రత్యేకించి రైతన్నలు, రైతు కూలీలకు మరింత మంచి జరగాలని జగన్ ఆకాంక్షించారు.
రాష్ట్రపతి, ప్రధానుల సంక్రాంతి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలు భోగి, సంక్రాంతి పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ ఆకాంక్షించారు. ఆయా పండుగలు జాతిని ఐక్యంగా ముందుకు నడిపేందుకు దోహదపడతాయని, ఇవి వ్యవసాయ పండుగలని, అందరిలోనూ సరికొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం విడివిడిగా సందేశాలు విడుదల చేశారు.
గవర్నర్, సీఎం, బాబు సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
నారావారిపల్లెకు బాబు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చంద్ర బాబునాయుడు తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు సోమవారం వెళ్లనున్నారు. స్వగ్రామంలో బాల్యస్నేహితులతో కలసి భోగి, సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.