మంత్రి ఇలాఖాలో మరో ప్యూను డాన్ శీను
‘సంపూర్ణ’ సహకారంతో ఇసుక సామ్రాజ్యాన్ని తన కనుసన్నలతో శాసిస్తున్న జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి.. లిక్కర్ సిండికేట్‌ను సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఇందుకు ఆయన అడుగులకు మడుగులొత్తేది ఎవరో కాదు... మద్యం వ్యాపారుల అసోసియేషన్‌లోని ఓ నేత. ఇతన్ని ఆ వర్గంలోని వారందరూ ‘డాన్ శీను’ అని పిలుస్తుంటారు. మద్యనిషేధం సమయంలో కటకటాల్లెక్కించిన ఈయనగారి హవా ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతోంది. అది ఎంతగా అంటే... ఎక్సైజ్ అధికారులనే శాసించేంత. మద్యం వ్యాపారుల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఈయన ‘సీను’ ఇదీ...
కలెక్షన్ కింగ్-2
- మంత్రిగారి ఆదేశాలతో అడ్డగోలు వసూళ్లు
- ఎమ్మార్పీకి అమ్మకుండా ఉండేందుకు తాయిలాలు
- దుకాణానికి రూ.25వేల నుంచి రూ.50వేలు డిమాండ్
- ఎదురు ప్రశ్నిస్తే దాడులే
- అధికారులు అడిగితే శంకరగిరి మాన్యాలే..
- నోరు మెదపని ఎక్సైజ్ శాఖ మంత్రి
సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాకు చెందిన ఓ మంత్రి అక్రమాలకు అంతులేకుండా పోతోంది. ఇసుక సిండికేట్లు మొదలు అధికారుల బదిలీల వరకు కలెక్షన్లకు పాల్పడటమే కాకుండా ఈ వ్యవహారమంతా చూసుకునేందుకు ఇప్పటికే ‘పరిపూర్ణ’ కలెక్షన్ కింగ్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి శాఖలోనూ తన అనుచరులను ఏర్పాటు చేసుకుని ఆ మంత్రి కోట్లు సంపాదిస్తున్నారనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఈ మంత్రి విషయంలో సాక్షాత్తూ జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని ఆయన అనుచరగణం వాపోతోంది.
అసోసియేషన్ అండతో..
జిల్లా మద్యం వ్యాపారుల అసోసియేషన్‌లో నాయకుడిగా ఉంటూ లిక్కర్ ‘డాన్ శ్రీను’గా గుర్తింపుపొందిన ఈయన మంత్రికి అత్యంత సన్నిహితుడు. మంత్రి సహాయంతోనే లిక్కర్ సిండికేట్లలో చక్రం తిప్పి కోట్ల రూపాయలు గడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లిక్కర్ డాన్ గతంలో మద్య నిషేధ సమయంలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయిన వ్యక్తి. దీంతో ఆ తరువాత ఈ రంగంలో అనుభవం గడించాడని, ఇప్పుడు ఏకంగా అసోసియేషన్‌లో కీలకం కావడంతో వీరి ఆదాయం మూడు బార్లు... ఆరు కలెక్షన్లుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి ఎన్నికల సమయంలో ఖర్చుల నిర్వహణ, పార్టీ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు వంటి వాటిని కూడా ఈ నాయకుడే చూశాడని సమాచారం. ఎక్సైజ్ అధికారులు కూడా వీరి కనుసన్నల్లోనే పనిచేయాలని, లేకపోతే రాయలసీమ జిల్లాలకు బదిలీ చేయిస్తారని ఆ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలిసిన పచ్చినిజం. ఈయన అనుగ్రహం పొంది లక్షలు సమర్పించుకుంటే కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పదవులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
తోటి సిండికేట్లపై దాడులు
తమ మాట వినని సిండికేట్లపై అధికారులతో దాడులు చేయించి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు ఈ డాన్ శ్రీను ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బెంజిసర్కిల్ సమీపంలోని ఒక బార్‌పై ఏడాదిలో మూడుసార్లు దాడులు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఏడాది కాలంగా నగరంలో ఎమ్మార్పీ రేట్లకు మద్యం అమ్మకుండా ఉండేందుకు ఒక్కో బ్రాంది దుకాణం నుంచి రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. ఇక ప్రభుత్వం పెట్టే మద్యం దుకాణాలు తమ ఏరియాల్లో పెట్టకుండా చూస్తామంటూ మద్యం వ్యాపారులను ఈ నాయకుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. తన ప్రమేయం లేదని చెబుతూనే అధికారులపైనే ఆయన సీరియస్ అవుతారని తెలిసింది. మంత్రితో తనకున్న పరిచయాలను తన సన్నిహితులకు, మిగిలిన మద్యం వ్యాపారులకు తెలిసేందుకు ఏడాదికి ఒకసారి మంత్రిని కుటుంబసభ్యులతో సహా ఆహ్వానించి స్నేహితులు, సన్నిహితులతో భోజనాలు ఏర్పాటుచేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆర్థికంగా స్థిరపడి..
మద్యం సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, మంత్రి అండదండలతో కోట్లకు పడగలెత్తిన ఈ నాయకుడు ఇప్పుడు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెడుతున్నాడని, గుణదలతో పాటు రాజధాని ప్రాంతంపైనా కన్నువేశాడని చెబుతున్నారు.