జిల్లాలో ఆధార్‌కార్డులు లేని వారికి గ్యాస్ కష్టాలు తప్పేట్టు లేవు. కొందరు ఆధార్ నమోదులో పాల్గొన్నా కార్డులు ఇప్పటికీ చేరలేదు. జిల్లాలో అక్టోబర్ నుంచి నగదు బదిలీ పథకం అమలుకానుంది.
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆధార్‌కార్డులు లేని వారికి గ్యాస్ కష్టాలు తప్పేట్టు లేవు. కొందరు ఆధార్ నమోదులో పాల్గొన్నా కార్డులు ఇప్పటికీ చేరలేదు. జిల్లాలో అక్టోబర్ నుంచి నగదు బదిలీ పథకం అమలుకానుంది. ఇప్పటికే మొదటి విడతలో ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు అవుతోంది. రెండో విడతలో పొరుగున్న ఉన్న ప్రకాశం జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఈ పథకం అమలుకానుంది. అధిక సంఖ్యలో ప్రజలు అధార్ నమోదు ప్రక్రియలో భాగస్వాములు కాలేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 29.74 లక్షల జనాభా ఉండగా వీరిలో 25 లక్షల మంది ఆధార్ నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 20.60 లక్షల మందికి మాత్రమే ఆధార్‌నంబర్లు ‘జనరేట్’ అయ్యాయి.
గ్యాస్ ఏజెన్సీలకు వివరాలు అందించింది 1.90 లక్షల మంది
జిల్లాలో మొత్తం 5,35,137 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆధార్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కేవలం లక్షా 90 వేల మంది మాత్రమే వివరాలు అందించారు. నగదు బదిలీ పథకం అమలైతే వీరంతా అర్హులు అవుతారు. మిగిలిన లబ్ధిదారులంతా గ్యాస్ సిలిండర్‌ను రూ.990కి కొనుగోలు చేయకతప్పదు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు అవుతోంది. ఆయా ప్రాంతాల్లో వినియోగదారులు వివరాలు అందచేయకపోవడంతో గ్యాస్‌ను రూ.990కి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం.
15 రోజుల్లో వివరాలు అందించాలి : జేసీ
15 రోజుల్లోగా ఆయా గ్యాస్ ఏజెన్సీలకు ఆధార్, బ్యాంక్ ఖాతా, కుటుంబసభ్యుల వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఆధార్‌కార్డులు అందని వారు ‘యూఐడీ, ఈఐడీ నంబర్లను అందచేయవచ్చు. త్వరలో గ్యాస్ వినియోగదారుల వివరాలను బ్యాంక్ ఖాతా నంబర్లతో అనుసంధాన ప్రక్రియ జరగనుంది. వినియోగదారులంతా త్వరితగతిన వివరాలందించాలి. అలాగే రేషన్‌కార్డుదారులు కూడా, బ్యాంక్ ఖాతా వివరాలను రేషన్‌దుకాణాల్లో అందజేయాలి.