పశ్చిమగోదావరి ,నిడదవోలు :నిడదవోలు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి సెంటర్‌లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డాక్టర్ అనిల్ ఆర్ధో అండ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదులు రావడంతో ఈనెల 11న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ పద్మజారాణి తన సిబ్బందితో అనిల్ ఆర్ధో అండ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నారని నిర్ధారించారు. వైద్యులు మండవ అనిల్ కుమార్ చౌదరిని ప్రశ్నించగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేకపోగా, ఒరిజినల్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ కూడా లేదని నిర్ధారించారు. అతనితో పాటు వైద్యం చేస్తున్న మరో వైద్యురాలు పుష్ప చౌదరి కూడా సర్టిఫికెట్లు చూపించలేదు.
రెండు రోజుల్లో ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. 15 రోజులు గడిచినా ఇంతవరకు అనుమతులకు సంబంధించిన రికార్డులను వైద్యాధికారులకు చూపకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.కోటేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా ఉప వైద్య ఆరోగ్య విస్తరణ, మీడియా అధికారి సీహెచ్.నాగేశ్వరరావు, తాడిమళ్ల పీహెచ్‌సీ ప్రభుత్వ వైద్యాధికారి పి.శ్రీకాంత్‌లు తమ సిబ్బందితో మళ్లీ ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించారు. ఈ సమయంలో వైద్యుడు అనిల్‌కుమార్ చౌదరి ఆసుపత్రిలో లేరు. దాంతో ఆసుపత్రిలో వైద్యుడి ఓపీ గది, ఆపరేషన్ థియేటర్, వార్డు గదులకు తాళాలు వేసి సీజ్ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించగా ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే రోగులకు వైద్య పరీక్షలు, ఆపరేషన్‌లు చేస్తున్నారని గుర్తించారు. వైద్యులు మండవ అనిల్ కుమార్ చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు.
అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రి సీజ్
Published Wed, Sep 27 2017 9:38 AM | Last Updated on Wed, Sep 27 2017 9:38 AM
Advertisement
Advertisement