ఫేస్‌బుక్ పరిచయంతో మోసపోయిన యువతి
ప్రేమించిన వ్యక్తి కోసం
బీహార్ నుంచి నెల్లూరు రాక
మూడు నెలలుగా ఇక్కడే
యువతిని వదిలివెళ్లిన
యువకుడు
నెల్లూరు(క్రైమ్): ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమించిన వ్యక్తి కోసం బీహార్‌కు చెందిన ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయి మూడు నెలల కిందట నెల్లూరు చేరింది. మూడు నెలలు కలిసి జీవించిన తర్వాత హఠాత్తుగా ప్రేమించిన వ్యక్తి ప్రవీణ్ అదృశ్యమయ్యాడు. నాలుగు రోజుల కిందట ప్రవీణ్ ఆమెకు కన్పించకుండా పోయాడు. దీంతో ఆ యువతి తాను మోసపోయానని తెలుసుకుంది. కుటుంబసభ్యులకు ఒకచోట నుంచి ఫోన్ చేసింది. దీంతో వారు ఆ ఫోన్ వివరాలను బీహార్ పోలీసుల ఆధారంగా తెలుసుకున్నారు. ఆంద్రప్రదేశ్‌లో నెల్లూరు నుంచి ఫోన్ వచ్చిందని తెలుసుకుని హుటాహుటిన కుటుంబసభ్యులు సోమవారం నెల్లూరు చేరారు.
జిల్లా ఎస్పీని డాక్టర్ గజరావుభూపాల్‌ను కలిసి సమస్య విన్నవించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఐదోనగర పోలీసులు మంగళవారం యువతిని గుర్తించి అప్పగించారు. బీహార్ రాష్ట్రం తల్కాసర్‌కు చెందిన రంజిత్‌సింగ్ కుమార్తె డింప్‌ల్‌నకు ఫేస్‌బుక్‌లో నెల్లూరుకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ప్రవీణ్‌ను కలిసేందుకు ఆమె నెల్లూరు చేరింది. కమార్తె అదృశ్యంపై ఆమె తండ్రి రంజిత్‌సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అటు బీహార్ పోలీసులు, ఇటు బాధిత కుటుంబసభ్యులు డింపుల్ కోసం తీవ్రంగా గాలించారు.
జిల్లా ఎస్పీ యువతి ఆచూకీ కనుగొనాలని నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్‌ను ఆదేశించారు. ఆయన సూచనల మేరకు ఐదోనగర ఇన్‌స్పెక్టర్ పి. సుబ్బారావు తన సిబ్బందితో కలిసి ఆటోనగర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం డింపుల్ అయ్యప్పగుడి వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఆమెను విచారించగా తాను మోసపోయానని పేర్కొంది. దీంతో బాధిత యువతిని వెంటబెట్టుకొని పోలీసులు ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో డింపుల్‌ను ఆమె కుటంబసభ్యులకు అప్పగించారు.