
బెదిరించేందుకు ప్రయత్నించి.. బలైపోయింది
వేమవరప్పాడులో మహిళ సజీవదహనం
రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి తీవ్రగాయాలు
వివాహేతర సంబంధం నేపథ్యంలో గొడవే కారణం!
వేమవరప్పాడు (కైకలూరు) : బెదిరించేందుకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ సజీవదహనమైంది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నిం చిన వ్యక్తికి తీవ్రగాయాలయ్యా యి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మండలంలో కలకలం రేపిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేమవరప్పాడు గ్రామానికి చెందిన సంసోను, గురవమ్మ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. వారిలో చిన్న కుతూరు బొజ్జ మరియమ్మ(37)కు కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏసుతో 19 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి దేవి, రేవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో పదేళ్ల నుంచి మరియమ్మ పిల్లలతో కలిసి ఉంటోంది.
పెద్ద కుమార్తె దేవీకి ఇటీవల వివాహం చేసింది. చిన్నకుమార్తె కూడా కొద్ది రోజులుగా అదే గ్రామంలో నివసిస్తున్న అమ్మమ్మ వద్ద ఉంటోంది. మరియమ్మ గ్రామ శివారులోని పంట పొలం వద్ద ఓ పూరింట్లో నివసిస్తోంది. ఆమె గ్రామంలోని మహిళా కూలీలను భీమవరంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనికి తీసుకెళుతూ మేస్త్రీగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం కలిదిండి మండలం పరసావానిపాలేనికి చెందిన ఆటోడ్రైవర్ పరసా గణేష్ (38)తో పరిచయమైంది. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
భయపెట్టేందుకు ప్రయత్నించి..
గణేష్ రెండు నెలలుగా మరియమ్మ ఇంటికి రావడం లేదు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆటోలో కూలీలను దించిన గణేష్ శనివారం రాత్రి అమె ఇంటికి వెళ్లాడు. తనను పట్టించుకోవడం లేదని గణేష్‌ను మరియమ్మ నిలదీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మరియమ్మ చనిపోతానని బెదిరిస్తూ ఒంటిపై కిరిసిన్ పోసుకుంది.
అగ్గిపుల్ల వెలిగించి అంటించుకుంటానని చెప్పేలోపే ఆమె చీరకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన గణేష్‌కు తీవ్ర గాయాలవడంతో బయటకు పరుగుతీశాడు. క్షణాల్లో మరియమ్మ సజీవదహనమైంది. ఇల్లు కూడా కాలి బూడిదైపోయింది. మరియమ్మ ఇల్లు గ్రామ శివారులో ఉండటంతో స్థానికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆమె కన్నుమూసింది.
గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న కైకలూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చేలోపే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కైకలూరు టౌన్, టూ టౌన్ అదనపు ఎస్‌ఐలు దాడి చంద్రశేఖర్, షబ్బిర్ అహ్మాద్, ఆర్‌ఐ ఇబ్రహీం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరియమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.