కైకలూరు : కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకుని తనువు చాలించింది. కైకలూరు టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కైకలూరుకు చెందిన సప్పా అప్పారావు, దమయంతి రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్ (28) కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఆదిరెడ్డి గౌరీశ్వరరావు, లక్ష్మి దంపతుల రెండో కుమార్తె రమ్యశ్రీ (25) తో 2016 మార్చి 23న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రెండున్నర ఎకరాల పొలం, రూ.6 లక్షల నగదు, 35 కాసుల బంగారం కట్నంగా ఇచ్చారు.
ఇటీవల మరికొంత నగదు, సామాగ్రి కూడా అదనంగా అందించారు. ప్రవీణ్‌కుమార్ కాకినాడ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. రమ్యశ్రీ ఇంజినీరింగ్ చదివింది. శుక్రవారం సాయంత్రం భర్త, అత్తమామలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా మేడపైకి వెళ్ళిన రమ్యశ్రీ ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందింది. చుట్టుపక్కల వాళ్ల నుంచి విషయం తెలుసుకున్న రమ్య తరఫు బంధువులు శనివారం కైకలూరు పెద్ద ఎత్తున వచ్చారు. తమ కుమార్తె మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమని మృతురాలి తండ్రి గౌరీశ్వరరావు ఆరోపించారు.
సమాచారం అందుకున్న గుడివాడ డీఎస్పీ మహేష్, కైకలూరు తహసీల్ధారు శ్రీనునాయక్, సీఐ వి.రవికుమార్, ఎస్సై గణేష్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని రమ్యశ్రీ మృతదేహానికి పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతురాలి తండ్రి గౌరీశ్వరరావు ఫిర్యాదు మేరకు కైకలూరు టౌన్ పోలీసులు భర్త ప్రవీణ్‌కుమార్, అతని తల్లిదండ్రులు అప్పారావు, దమయంతి, తమ్ముడు చిన్నా, బాబాయి సీతారామయ్య, మేనమామ ధర్నారావులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
తల్లడిల్లిన తల్లి హృదయం..
మృతురాలి తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు. తండ్రి వ్యవసాయ కూలీ. మొదటి, రెండో కుమార్తెలకు వివాహాలు చేశారు. మరో ఇరువురు చదువుకుంటున్నారు. రమ్యశ్రీ మృతదేహాన్ని చూసి సోదరి, తల్లిదండ్రులు విలపించిన తీరు కంట తడి పెట్టించింది. తల్లి, సోదరి మాట్లాడుతూ రమ్యశ్రీ మరణానికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని, మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment