భర్త పృథ్వీరాజ్‌తో సంతోషిని (ఫైల్) సంతోషి (ఫైల్)
ఆదిలాబాద్(నేరడిగొండ): అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైన ఘటన నేరడిగొండ మండలం రాజుర గ్రామంలో శుక్రవారం జరిగింది. బోథ్ మండలం కండేపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్–శ్యామల దంపతుల కూతురు సంతోషి ఉరఫ్ కృష్ణవాణి(26)కి రాజుర గ్రామానికి చెందిన పృథ్వీరాజ్‌తో ఏడాది క్రితం వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.18.50 లక్షల నగదు, బంగారం, ఇతర లాంచనాలు ముట్టజెప్పారు. మూడు నెలలు సాఫీగా సాగిన కాపురం జీవితంలో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి.
దీంతో సంతోషి తల్లిదండ్రులు అదనంగా రూ.6 లక్షలు ఇవ్వడంతోపాటు నిర్మల్‌లో ప్లాట్ కొనుగోలు చేశారు. శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఉదయం 7:30 గంటలకు పృథ్వీరాజ్ తండ్రి ప్రకాష్‌కు ఫోన్ చేసి సంతోషి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన రాజుర గ్రామానికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కూతురును చూసి బోరున విలపించారు. ఇంతలో ఇచ్చోడ సీఐ రమేశ్‌బాబు, ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. ఇంతలో ఏఎస్పీ హర్షవర్ధన్ చేరుకుని కుటుంబీకులకు నచ్చజెప్పారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం బోథ్ ఆస్పత్రికి తరలించారు. భర్త పృథ్వీరాజ్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు, ఆడపడుచులు, అల్లుళ్లు చిత్రహింసలు పెట్టి చంపారని ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: సరదాగా మాట్లాడుకుందామని పిలిచి..
Comments
Please login to add a commentAdd a comment