
గుంతకల్లు: ఓ మహిళ ఆత్మహత్యాయత్నం గుంతకల్లులో కలకలం రేపింది. రైల్వే ఆస్పత్రి సమీపాన గల పురాతన ఓవర్‌హెడ్ ట్యాంకుపైకి సోమవారం ఓ మహిళ ఎక్కింది. కిందకు దూకి చనిపోతానంటూ కేకలు వేసింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటప్రసాద్, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ భాస్కర్ నేతృత్వంలో సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. నానా అగచాట్లు పడి ఆ మహిళను కిందకు దించి, విచారణ చేపట్టారు. తన పేరు జానకి అని, ఊరు మహబూబ్‌నగర్ జిల్లా గార్లపాడు అని, పదకొండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారని ఆమె తెలిపింది. పెద్దమ్మ, పెద్దనాన్నల వద్ద పెరిగానని, అయితే వారు తరచూ కొడుతుండటంతో బాధ భరించలేక హైదరాబాద్‌కెళ్లి ఆ పని ఈ పని చేసుకుంటూ పొట్ట నింపుకునేదాన్నని వివరించి.
ఈ నేపథ్యంలోనే అన్వర్ అనే వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని వాపోయింది. కొన్ని నెలలుగా మతిస్థిమితం సరిగా లేదని, రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో రైలెక్కి గుంతకల్లు స్టేషన్‌లో దిగానని తెలిపింది. చచ్చిపోవాలనుకుని ట్యాంకుపైకి ఎక్కినట్లు చెప్పింది. జానకి ఇచ్చిన సెల్ నంబర్‌కు డయల్ చేస్తే హైదరాబాద్‌లోని సురేష్ అనే కాంట్రాక్టర్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. జానకి చెప్పిందంతా వాస్తవమేనని, కొన్నేళ్లుగా తన వద్ద స్వీపర్‌గా పని చేస్తుండేదని పేర్కొన్నాడు. రెండు నెలలుగా మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయిందని తెలిపాడు. జానకి హైదరాబాద్ పోతాననడంతో స్థానికులు కొందరు ఆమెను రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లి వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment