బద్వేలు(వైఎస్సార్ జిల్లా): కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బద్వేలు నుంచి బయనపల్లి గ్రామం వెళ్తున్న ఆటో గ్రామ సమీపంలో రోడ్డుపై అడ్డంగా ఉన్న కుక్కను తప్పించబోయే క్రమంలో బోల్తా పడింది.
ఈ ఘటనలో బయనపల్లి గ్రామానికి చెందిన శీలం లలితమ్మ(36), ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ముగ్గురు, మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. లలితమ్మను బద్వేలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. గాయపడిన మిగిలిన నలుగురు వ్యక్తులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.