కావలిపురంలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మరణిచింది. తమ బిడ్డను అదనపు కట్నం
కావలిపురం (ఇరగవరం) : కావలిపురంలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మరణిచింది. తమ బిడ్డను అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్న భర్త, అత్తమామలు హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఫ్యాన్‌కు చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త, అత్తమామలు చెబుతున్నారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇవి.. మొగల్తూరకు చెందిన కడలి మీనాక్షి(23), అదే గ్రామానికి చెందిన కట్టా శ్రీనివాసరావుకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాసరావుకు రూ. 1.80 లక్షల కట్నం ఇచ్చారు.
వివాహ సమయానికి అతను ఆ గ్రామంలో కేబుల్ ఆపరేటర్. పెళ్లయిన మూడు నెలలకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అతను భీమవరంలో పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు సంతానం కలిగారు. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే పెద్ద మొత్తంలో కట్నం వచ్చేదని సూటిపోటి మాటలతో మీనాక్షిని ఆమె భర్త, అత్తమామలు మంగమ్మ, వెంకటేశ్వరరావు వేధిస్తుండేవారని మృతురాలి బంధువులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మర ణించింది. పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు, ఇరగవరం ఎస్సై వీఎస్‌వీ భద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె భర్త, అత్తమామలను విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
హత్య అనే అనుమానం !
పడకగది తలుపు వేసి ఉండటంతో పగలగొట్టి చూడగా మీనాక్షి ఉరి వేసుకుని ఉందని ఆమె భర్త, అత్తమామలు చెబుతున్నారు. డాబా మెట్ల మీదనుంచి జారిపడి గాయాలపాలైందని తమ అల్లుడు శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్పాడని మీనాక్షి తల్లిదండ్రులు తెలిపారు. ఇక్కడకు వచ్చాక ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారని వారు వాపోయారు. తమ కుమార్తెకు ఫోన్ చేసిన ప్రతిసారీ భర్త, అత్తమామలు హింసిస్తున్న తీరును వివరించేందని, సంసారమన్నాక చిన్న తగాదాలు వస్తుంటాయి సర్దుకుపోవాలని నచ్చజెప్పేవాళ్లమని తెలిపారు. ఇలా ప్రాణాలు తీస్తారని అనుకోలేదని విలపించారు. ఆమె ఉరి వేసుకున్న ఆనవాళ్లు శరీరంపై లేవని, ఆమె వ జాకెట్టు చిరిగి ఉండటంతో మృతికి ముందు పెనుగులాడినట్టు స్పష్టమవుతోందని ఆమె బంధువులు పేర్కొంటున్నారు.