సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఇప్పటికీ మహిళల అక్షరాస్యతలో వెనుకబడిన మండలాలు 470కి పైగా ఉన్నాయి.. వాటిల్లోని 9,505 గ్రామాల్లో 5,70,000 మంది మహిళలు ఇంకా నిరక్షరాస్యులే. అక్షరాస్యత కోసం గతంలో వయోజన విద్య, మూడేళ్లుగా సాక్షర భారత్ వంటి కార్యక్రమం అమలు చేస్తున్నా.. ఇంకా మహిళలు అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు.అందుకే 15 నుంచి 55 ఏళ్లలోపు మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం పట్ల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. 9,505 గ్రామాల్లో ఇప్పటికే ఉన్న వయోజన విద్యా కేంద్రాలు కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నవంబర్ 15 నుంచి ఆరు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. వీటిల్లో చదువుకున్న మిహ ళల్లో ఆసక్తి కలిగిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్ వరకు చదువుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీతో అనుసంధానం చేస్తున్నట్టు ఆమె తెలిపారు.
ఇదీ ప్రత్యేక కార్యక్రమం...
ఒక్కొక్క గ్రామంలో రెండు కేంద్రాల వరకు ఏర్పాటు చేస్తారు. ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తారు. ఒక్కో కేంద్రంలో 30 మందిని చేర్పించాలి. రోజుకు 2 గంటలు నిర్వహించే కేంద్రంలో 30 మందిలో కనీసం 25 మందిని పూర్తి స్థాయిలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇన్‌స్ట్రక్టర్‌దే. ఆరు నెలల తరువాత వారికి జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ(ఎన్‌ఐఓఎస్) పరీక్ష నిర్వహించి అక్షరాస్యులుగా సర్టిఫికెట్లు ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కుటుంబ బాధ్యతల్లో పడి చదువుకు దూరమైన మహిళలు ఐదేళ్లలోనే ఇంటర్మీడియెట్ వరకు చదువుకునేలా చూస్తామని పూనం మాల కొండయ్య వివరించారు.
నిరక్షరాస్యుల్లో అధిక శాతం మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీలే అయినందున వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమంలో చదువుకున్న తర్వాత ఆసక్తి ఉంటే, మొదటి ఏడాది ఓపెన్ స్కూల్లో 3, 5 తరగతులు ఒకే ఏడాదిలో చదుకోవచ్చు. తరువాత ఏడాది 8వ తరగతి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ మరుసటి సంవత్సరంలో పదవ తరగతి చదువుకొని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రెండేళ్లలో ఇంటర్మీడియెట్ చదువుకునేలా అవకాశం కల్పిస్తున్నారు.
మహిళలకు సరస్వతీ కటాక్షం!
Published Wed, Oct 30 2013 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement