వర్క్ షాప్ లో మాట్లాడుతున్న మహోపాత్ర... చిత్రంలో హిమాన్షు పాఠక్, పూనం మాలకొండయ్య తదితరులు
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించడంలో ఏపీ ప్రభుత్వం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ (నాస్) ప్రెసిడెంట్ టి.మహోపాత్ర ప్రశంసించారు. జాతీయ స్థాయిలో ఏపీ మోడల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు.
నాస్ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మోడల్స్’ అనే అంశంపై న్యూఢిల్లీలో సోమవారం జరిగిన జాతీయ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు ఆలోచనే ఓ అద్భుతమన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, గోదాములు, శీతలీకరణ గదులు, కలెక్షన్ సెంటర్లతోపాటు నియోజకవర్గ స్థాయిలో అగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. వీటిని జాతీయ స్థాయిలో అమలు చేయాలని సూచించారు.
ఈ మేరకు కేంద్రానికి నివేదిక సమర్పిస్తామన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ ఆర్బీకేల సాంకేతికత పట్ల విదేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలో అమలుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీ తరహాలో సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్ పంపిణీ, ప్రభుత్వ సేవలు, రైతు శిక్షణ కార్యక్రమాలు, పంట కొనుగోళ్లు గ్రామ స్థాయిలో చేపడితే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏకే సింగ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంతో ఐసీఏఆర్ కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఆర్బీకేల బలోపేతానికి ఐసీఎఆర్ చేయూతనిస్తుందన్నారు.
సీఎం ఆలోచనల నుంచే ఆర్బీకేలు..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఆర్బీకే వ్యవస్థ అని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. వర్క్‌షాపులో ఆర్బీకే సేవలపై ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకే కాకుండా ఆక్వా, మత్స్యసాగు చేసే రైతులు, పాడి రైతులకు కూడా సేవలందిస్తున్నామన్నారు.
ఈ–క్రాప్, ఈ–కేవైసీ విధానాల ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అం దేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతులకు అందిస్తున్నామన్నారు. రైతుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను గ్రామ స్థాయిలోనే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్ పంపిణీ కోసం నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌తో పాటు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.కార్యక్రమంలో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ మనీష్ సి.షా, నాస్ కార్యదర్శి డాక్టర్ పీకే జోషి, నాబార్డు సీజీఎం సీఎస్‌ఆర్ మూర్తి, మేనేజ్ డైరెక్టర్ జనరల్ పి.చంద్ర శేఖర, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment