
బోయకొండ గంగమ్మ ఆలయ కార్యాలయంలోని గదులను పరిశీలిస్తున్న తహసీల్దార్, ఎంపీడీవో
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో కార్యాలయంలోని ఓ గదిలో మహిళను కాళ్లు, చేతులు కట్టేసినట్టు సోషియల్ మీడియాలో బుధవారం ఫొటోలు హల్‌చల్ చేశాయి. దీంతో అధికారులు ఉలిక్కిపడి ఆలయ కార్యాలయం వద్దకు పరుగులు తీశారు. తహసీల్దార్ భాగ్యలత, ఎంపీడీవో శంకరయ్య, హెడ్‌కానిస్టేబుల్ రఘు అన్ని గదులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. గత ఏడాది మేలో అక్కడ పనిచేస్తున్న స్వీపర్ రత్నమ్మను కాళ్లు, చేతులు కట్టేసి పడేసిన సంఘటన సంచలనం కలిగించింది.
అప్పుడు తీసిన ఫొటోలను బుధవారం జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలిపారు. స్వీపర్లుగా పనిచేస్తున్న రత్నమ్మ, పార్వతమ్మ ఈ నెల 3న జరిగిన హుండీ లెక్కింపులో నగదు చోరీ చేశారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment