అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మాచర్ల టౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అనిశెట్టి లక్ష్మమ్మ(30) మృతదేహం గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి పక్కన శ్మశాన వాటికలో చెట్టుకు వేలాడుతుండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ వెంకటేశ్వరరెడ్డి అక్కడికి చేరుకుని లక్ష్మమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కాళ్లు బురదలో కూరుకున్నట్లు, చేతులకు గాయాలు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు విజయపురి సౌత్ ఎస్‌ఐ నిస్సార్‌బాషా తెలిపారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ జరిగింది.. పోలీసులు, స్థానికులు, మృతురాలి భర్త చెప్పిన వివరాల ప్రకా రం.. వెల్దుర్తి మండలం పట్లవీడు గ్రామానికి చెందిన లక్ష్మమ్మతో కొత్తపల్లికి చెందిన అనిశెట్టి సాంబయ్యకు 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. సాంబయ్య జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లుతో లక్ష్మమ్మ సన్నిహితంగా ఉండటంపై దంపతులిద్దరి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది.
దీంతో 6 నెలల కిందట లక్ష్మమ్మ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోరుుంది. పిల్లలు ఇబ్బంది పడుతున్నారని నచ్చచెప్పి సాంబయ్య లక్ష్మమ్మను తిరిగి తీసుకువచ్చాడు. రెండు నెలలపాటు బాగానే ఉన్న వీరి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికొచ్చిన సాంబయ్య లక్ష్మమ్మ చేతిలో ఓ ఉత్తరం ఉండటాన్ని గమనించి ప్రశ్నించాడు. ఉత్తరాన్ని తీసుకుని చదవటం రాకపోవటంతో భద్రపరచబోయూడు. ఈలోగా లక్ష్మమ్మ దాన్ని లాక్కొని చించివేసింది. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావటంతో సెల్‌ఫోన్ ఎక్కడిదని సాంబయ్య ప్రశ్నించాడు. సెల్‌ఫోన్ లాక్కొని దాచిపెట్టాడు. తర్వాత వెంకటేశ్వర్లు ఇంటికెళ్లి అతడితో గొడవ పడ్డాడు.
దీంతో ఆందోళన చెందిన లక్ష్మమ్మ మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోరుు తిరిగిరాలేదు. పట్లవీడులోని తల్లిదండ్రులను అడగ్గా రాలేదని వారు చెప్పటంతో చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. తీరా గురువారం ఉదయం లక్ష్మమ్మ మృతదేహం శ్మశానంలోని చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అక్కడకు చేరుకున్న సాంబయ్య, కుమారులు బాను, రోహిత్, బంధువులు బోరున విలపించారు.
ఎన్నో అనుమానాలు.. దాదాపు 20 అడుగుల ఎత్తున్న చెట్టు ఎక్కి లక్ష్మమ్మ ఉరి వేసుకోవటం సాధ్యం కానిపనని స్థానికులు అంటున్నారు. వెంకటేశ్వర్లు, సాంబయ్యల్లో ఎవరో ఒకరు ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మమ్మను భర్త సాంబయ్యే హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. మరికొందరితో కలిసి వెంకటేశ్వర్లే తన భార్యను హత్యచేసి ఉంటాడని సాంబయ్య విలేకరుల వద్ద ఆరోపించాడు.