అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
Published Sat, Aug 17 2013 3:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఉద్యోగులకిచ్చి చేస్తే పిల్లలు సుఖపడతారని తన ఇద్దరు కుమార్తెలను అన్నదమ్ములిద్దరికీ ఇచ్చి పెళ్లి చేశారు. తొమ్మిది నెలల కిందట చిన్న కూతురు ఆత్మహత్య వార్త వారికి అశనిపాతంలా తగిలింది. కట్టుకున్నవాడే కడతేర్చాడనే అనుమానం ఉన్నా... ఆ కుటుంబంలోనే కోడలిగా ఉన్న మూడో కుమార్తె కాపురానికి ఇబ్బంది కలగకూడదని మారుమాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తే...ఏడాది వ్యవధిలో ఇద్దరు కూతుళ్లూ విగతజీవులై ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఖాన్ని మిగిల్చివెళ్లారు.
పిట్టలవానిపాలెం,న్యూస్‌లైన్ : పిట్టలవానిపాలెం శివారు డేగలవారి పాలెంకు చెందిన వివాహిత శీలం తిరుపతమ్మ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మృతురాలి తల్లిదండ్రులు,గ్రామస్తుల కథనం ప్రకారం చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామ పంచాయతీలోని మోరవాగుపాలెంకు చెందిన దొంతిరెడ్డి కొండలురెడ్డి, వెంకటేశ్వరమ్మలకు నలుగురు కుమార్తెలు వీరిలో మూడో, నాల్గో కుమార్తెలను పిట్టలవానిపాలెం గ్రామ శివారు డేగలవారిపాలెంకు చెందిన శీలం పోతురాజు రెడ్డి,వెంకటేశ్వరమ్మల కుమారులకు ఇచ్చి పెళ్లిచేశారు. ఆర్మీలో పనిచేస్తున్న పోతురాజురెడ్డి పెద్దకొడుకు నాగరాజురెడ్డికి నాలుగేళ్ల కిందట మూడో కుమార్తె తిరుపతమ్మతో వివాహం చేయగా, ఏడాది కిందట నాలుగో కుమార్తె వీరస్వామమ్మను సీఆర్‌పీఎఫ్‌లో పనిచేస్తున్న చిన్న కొడుకు కోటిరెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు.
తొమ్మిది నెలల కిందట వీరస్వామమ్మ ఆత్మహత్య చేసుకుందని ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని తెలిసినా మూడో కుమార్తె తిరుపతమ్మ కాపురం బాగుండాలనే ఉద్దేశంతో ఎలాంటి కేసులు పెట్టకుండా కొండలురెడ్డి మిన్నకుండిపోయాడు. ఇంతలో శుక్రవారం ఆ దంపతులకు మరో పిడుగుపాటు లాంటి వార్త చెవినపడింది. తిరుపతమ్మ ఉరి వేసుకుని చనిపోయిందని మోరవాగుపాలెంకు చెందిన అక్కల శ్రీనివాసరెడ్డికి తమ అల్లుడు నాగరాజురెడ్డి ఫోన్‌చేసి చెప్పినట్లు మృతురాలి తండ్రి చందోలు పోలీసులకు పిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు.
చెల్లికి పట్టిన గతే పడుతుంది...
అదనపు కట్నం తీసుకురావాలని, లేకపోతే నీ చెల్లిలికి పట్టిన గతే నీకూ పడుతుందని ఇటీవల అనేకసార్లు నాగరాజు రెడ్డి తిరుపతమ్మను శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో తిరుపతమ్మ పుట్టింటికి వచ్చింది. ఆర్మీ నుంచి సెలవులో 10 రోజుల క్రితం గ్రామానికి వచ్చిన నాగరాజు ఈ నెల 12న తల్లిదండ్రులు, బంధువులతో కలిసి మోరవాగుపాలెం వచ్చి, ఇక నుంచి ఎలాంటి గొడవలు లేకుండా కాపురం చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కొండలురెడ్డి దంపతులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరుపతమ్మ ఉరివేసుకుని చనిపోయిందనే కబురు అందింది.
నాకే పాపం తెలియదు...
తన భార్య తిరుపతమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, తనకు ఏపాపం తెలియదని మృతురాలి భర్త నాగరాజు రెడ్డి చెబుతున్నాడు.పొలంలో నాటు వేస్తున్నామని మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు వేసి ఉందన్నారు. లోపలికి చూస్తే ఉరికి వేలాడుతోందని, వెంటనే చెరుకుపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లగా, చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తెలిపాడు.
Advertisement