నిడదవోలు (పశ్చిమ గోదావరి) : తోబుట్టువులు.. బంధువులు.. స్నేహితులు జాతర సందర్భంగా ఆనందంగా గడుపుతున్న సమయంలో విషాదవార్త ఆ కుటుంబాన్ని కలచివేసింది. అర గంటలో బంధువుల చెంతకు చేరే సమయంలో క్వారీ లారీ మృత్యురూపంలో కబళించింది. నిడదవోలు రైల్వే గేటు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. చాగల్లు మండలం కలవలపల్లి గ్రామంలో ఆదివారం జాతర కావడంతో కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామానికి చెందిన ఒడుగు గంగారావు, సూర్యకళ (50) దంపతులు ఉదయం స్కూటర్‌పై కలవలపల్లి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో నిడదవోలు రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి గేటు వేసి ఉండటంతో గంగారావు స్కూటర్‌ను ఆపి వేచి చూస్తున్నారు.
గంగారావు దంపతులు గేటు తెరుస్తారని చూస్తుండగా తాడేపల్లిగూడెం వైపు నుంచి పంగిడి వెళ్తున్న క్వారీ లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌ను పది అడుగుల దూరం లారీ ఈడ్చుకెళ్లింది. గంగారావు, వెనుక కూర్చున్న సూర్యకళకు తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే సూర్యకళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గంగారావుకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, బంధువులు నిడదవోలు వచ్చారు. ప్రభుత్వాస్పత్రి వద్ద వీరి రోదనలు మిన్నంటాయి. పట్టణ ఎస్సై జి.సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment