కంటతడి పెట్టిన ఎంపీపీ నాగమణి
♦ చదువు రాదంటూ అవహేళన
♦ కంటతడి పెట్టిన ఎంపీపీ నాగమణి
♦ శిల్పా భువనేశ్వరరెడ్డి తీరుపై ఆగ్రహం
కర్నూలు జిల్లా : ‘‘ మీ ప్రిన్సిపల్ మేడమ్ చదువుకుంది...ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంది. ఎంపీపీ చదువుకోలేదు.. సరిగా మాట్లాడలేదు’’ అంటూ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి సమీప బంధువు, టీడీపీ నాయకుడు శిల్పా భువనేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మహానంది ఎంపీపీ చింతం నాగమణి కంటతడిపెట్టారు. ఈ ఘటన గురువారం మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో గురువారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వరరెడ్డి విద్య ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫర్హానాబేగం బాగా చదువుకోవడం వల్లే ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారని, ఎంపీపీ చింతం నాగమణి పెద్దగా చదువుకోకపోవడం వల్లే మాట్లాడలేకపోతున్నారని ఉదహరించి చెప్పారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఎంపీపీ చింతం నాగమణి కన్నీరు పెట్టుకుని ఏడ్చుకుంటూ బయటికి వెళ్లారు. ఆమె బయటికి రాగా అక్కడే ఉన్న ఎంపీటీసీ సభ్యులు దస్తగిరి, నాగపుల్లయ్యలు ఆమెకు సర్దిచెప్పడంతో ఆమె సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాటలను టీడీపీ నాయకులు తప్పు పట్టారు. ఇదిలా ఉండగా ఎంపీపీ నాగమణి భర్త చింతం క్రాంతికుమార్ మాట్లాడుతూ.. తన భార్య నిరక్షరాస్యురాలేమి కాదని, 2006లో ఇంటర్ పూర్తి చేశారని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే ఎంపీపీ పదవిని చేపట్టడంతో స్టేజీల మీద ప్రసంగించడానికి కాస్త భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ పదవీ లేని శిల్పా భువనేశ్వరరెడ్డి.. ప్రభుత్వ కార్యక్రమానికి ఏ హోదాలో ముఖ్య అతిథిగా వచ్చారని స్థానిక అధికారులు, విద్యావంతులు చర్చించుకున్నారు.