Bicycle distribution program
-
కోడ్‌కు అడ్డంగా సవారీ
సాక్షి, ఘంటసాల : ఎన్నికల నిబంధనలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ మాకేం పట్టిందంటూ వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ను పాటించాల్సిన అధికారులు మాత్రం కేవలం తమ కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. మండల కేంద్రమైన ఘంటసాల హైస్కూల్లో విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సైకిళ్లను సిద్ధం చేస్తున్నారు. మండలంలో 8, 9 తరగతులు చదువుతున్న 212 మందికి పంపిణీ చేసేందుకు కొత్త సైకిళ్లను ఇటీవల తీసుకువచ్చారు. స్కూల్లోనే రహస్యంగా పార్టులు అమర్చుతున్నారు. స్థానిక హైస్కూల్ వద్ద సైకిళ్లు బిగించే విషయమై ఎంఈఓ బీహెచ్‌సీ సుబ్బారావును సాక్షి వివరణ కోరగా సైకిళ్ల పంపిణీ విషయంలో తమకు సంబంధం లేదని, సంబంధిత కాంట్రాక్టర్‌కు షెల్టర్ కల్పించడం వరకే తమ పని అని మండలంలోని అన్ని హైస్కూల్స్‌కు సంబంధిత కాంట్రాక్టరే సైకిళ్లు పంపిణీ చేస్తాడని చెప్పారు. -
బడికొచ్చిన సైకిల్‌కు బ్రేక్
సాక్షి, ఒంగోలు టౌన్: బడికొస్తా సైకిళ్లు ఒక్కసారిగా కలకలం రేపాయి. బడికొస్తా సైకిళ్లను పాఠశాల ప్రాంగణంలో ఫిట్టింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలతో ముద్రించిన సైకిళ్లను పంపిణీ చేసేందుకు అన్నట్లుగా సిద్ధం చేస్తుండటంతో ఒక్కసారిగా కలవరం రేకెత్తించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారా అన్నట్లుగా బడికొస్తా సైకిళ్లను ఫిట్టింగ్ చేస్తుండటంతో ఎక్కడ వాటిని పంపిణీ చేస్తారోనన్న ఉత్కంఠత నెలకొంది. బెడిసికొట్టిన వ్యూహం బడికొస్తా సైకిళ్ల పంపిణీలో చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికలకు బడికొస్తా పథకం కింద సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో బాలికలకు ఇవ్వాల్సిన సైకిళ్లను మరికొన్ని రోజుల్లో విద్యా సంవత్సరం ముగుస్తుందనగా వాటిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ ఒక్కదానిని అమలు చేయకూడదు. ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు బడికొస్తా కింద సైకిళ్లను ఇవ్వడం ద్వారా ఉచిత ప్రచారం పొందవచ్చని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే విద్యా సంవత్సరం చివర్లో ఆ సైకిళ్లను బాలికలకు అందించి ఉచిత పబ్లిసిటీ పొందవచ్చన్న చంద్రబాబు ప్లాన్ తిరగబడింది. బాబు, గంటా ఫొటోలు బడికొస్తా పథకం కింద బాలికలకు ప్రతి ఏటా సైకిళ్లను అందజేయడం జరుగుతోంది. బాలికల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించాలన్న ఉద్దేశ్యంతో వీటిని అందజేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుకుంటున్న 23వేల మందికి సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు జిల్లా నుండి ఇండెంట్ పంపడం జరిగింది. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం బడికొస్తా సైకిళ్ల పంపిణీని ఆలస్యం చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత సైకిళ్లను అందిస్తే వాటిపై ముద్రించిన చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు ఫొటోలు ఎక్కడ పాతబడిపోతాయో లేకుంటే ఆ ఫొటోలను తొలగిస్తారోనన్న అనుమానంతో చేపట్టిన వ్యూహం బెడిసికొట్టింది. ఫిట్టర్స్ రావడంతోనే ఫిట్టింగ్ బడికొస్తా పథకం కింద బాలికలకు సైకిళ్ల విడి భాగాలు ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చాయని జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు తెలిపారు.∙ఫిట్టర్స్ బీహార్, హర్యానా నుండి ఇక్కడకు వచ్చారన్నారు. ఫిట్ చేసుకుంటూ ఇక్కడకు వచ్చారని, వారిని తిరిగి పిలవాలంటే కష్టమనే ఉద్దేశ్యంతో ఫిట్టింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాటిని పంపిణీ చేయమని స్పష్టం చేశారు. -
కోడ్ సైకిలెక్కింది
సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ విషయం ఏడాది పాటు పట్టనట్లు వ్యవహరించిన ప్రభుత్వం.. ఎన్నికలు రావడంతో హడావుడి చేస్తోంది. ఇదంతా ఎన్నికల స్టంటేనని, బాలికల విద్యపైన ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడికొస్తా పథకంలో భాగంగా జిల్లాలోని 20 వేల మందికి పైగా బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో (గతేడాది జూన్, జూలైలో) అందజేయాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించి.. తీరా ఎన్నికలు వస్తుండటంతో.. విద్యా సంవత్సరం ముగిసే సమయంలో సైకిళ్ల పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ఎన్నికల నగారా మోగింది. దీంతో ఈ నెల 10 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం జిల్లాలో అక్కడక్కడా సైకిళ్లు పంపిణీ చేస్తూ.. ఎన్నికల కోడ్ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వకపోగా.. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన సైకిళ్లను ఇవ్వకపోగా.. ఇప్పడేమో తాము ఇస్తుంటే.. వైఎస్ఆర్సీపీ వారు అడ్డుకుంటున్నారనే అపవాదును వారి పైకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. విద్యాశాఖాధికారులు పంపిణీకి సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదంతా విద్యార్థులపైన ప్రేమ కాదని, ప్రభుతంపైన ఉన్న స్వామి భక్తిని చాటుకునేందుకేనని పలువురు విమర్శిస్తున్నారు. అదే విద్యా సంవత్సరం మొదట్లో పంపిణీ చేసి ఉంటే.. బాగుండేది కదా అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అటు అధికారులను, ఇటు ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. పంపిణీ యత్నం కడపలోని జయనగర్‌లో మంగళవారం సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తుండగా.. ‘సాక్షి’ కంటపడటంతో విద్యాశాఖాధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించారు. ఎర్రగుంట్ల జెడ్పీ బాలికల పాఠశాలలో సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఆవరణలో సిద్ధంగా ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వెళ్లి.. ఎంఈఓ బాలశౌరమ్మ, మున్సిపల్ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి సైకిళ్లను గదిలోకి మార్పించారు. సైకిళ్ల స్టిక్కరింగ్‌లను వెంటనే తొలగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ పని చేపట్టకూడదని హెచ్ఎం పావనికి అధికారులు సూచించారు. సైకిళ్ల పంపిణీ చేయలేదని, కేవలం గదిలో ఉన్న వాటిని బయట ఉంచామని ఆమె చెప్పుకొచ్చారు. -
అభాసుపాలవుతున్న బడికొస్తా పథకం
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలంలో బడికొస్తా పథకం అభాసు పాలవుతోంది. విద్యాసంవత్సరం నెలరోజుల్లో ముగియనుండడంతో ఇప్పుడు సైకిళ్ల కేటాయింపులు చేయడం చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం బడికొస్తా పథకం ప్రవేశపెట్టింది. 8,9 తరగతులు చదివే విద్యార్థినులకు బడికి చేరుకునేందుకు వీలుగా సైకిళ్ళు పంపిణీ చేస్తారు. అయితే ఈ పథకం ప్రారంభంలో బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 8,9 తరగతులు చదివే విద్యార్ధినులకు ఉచితంగా సైకిళ్ళు అందించేందుకు నిర్ణయించినా పాలకులు, అధికారులు స్పందించడంలేదు. ఇప్పుడు గుర్తొచ్చిందా.. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ జరగలేదు. అయితే విద్యాసంవత్సరం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం వీటిని ఆర్భాటంగా అందించేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తే విద్యాశాఖ పనితీరు అర్థమవుతుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు సైకిళ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాలికలు సైకిళ్లు తొక్కుతూ వెళుతుంటే వాటిపై వేసిన స్టిక్కర్లను చూసి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందని అందరికి తెలిసేందుకే చేశారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావడంతో ఎన్నికల మైలేజ్‌గానూ ఈ బడికొస్తా పధకాన్ని వాడుతున్నారనేది మరో విమర్శ వినిపిస్తోంది. నియోజకవర్గానికి 1433 సైకిళ్లు... నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాలున్నాయి. వీటిలో చీరాల మండలంలో 2016–17 విద్యాసంవత్సరానికి గాను 148 మంది విద్యార్థినులకు అందించారు. ఈ తర్వాత 2017–18 విద్యాసంవత్సరానికి ఇవ్వలేదు. అలానే వేటపాలెం మండలంలో 2017–18 గాను 178 సైకిళ్లు అందించారు. 2018–19 విద్యాసంవత్సరానికి సైకిళ్ళును అందించలేదు. హైస్కూళ్ళ వారీగా విద్యార్థినుల సంఖ్య ఆధారంగా ప్రధానోపాధ్యాయులు వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. చీరాల మండలానికి 1029, వేటపాలెం మండలానికి 414 మందికి అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే సకాలంలో పంపిణీ చేయకపోవడంతో విద్యార్థినులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాఠశాలలకు చేరుకుంటున్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి విద్యార్థినులు ఆటోలు ద్వారా వస్తున్నారు. సైకిళ్ళు పంపిణీ చేయకపోవడంతో ఆటోలు, ఇతర మార్గాల ద్వారా వస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా ఇదే తీరుగా ఉంది. కోడిగుడ్లు కూడా సక్రమంగా లేవు. చిన్న సైజు గుడ్లు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. -
కంటతడి పెట్టిన ఎంపీపీ నాగమణి
♦ చదువు రాదంటూ అవహేళన ♦ కంటతడి పెట్టిన ఎంపీపీ నాగమణి ♦ శిల్పా భువనేశ్వరరెడ్డి తీరుపై ఆగ్రహం కర్నూలు జిల్లా : ‘‘ మీ ప్రిన్సిపల్ మేడమ్ చదువుకుంది...ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంది. ఎంపీపీ చదువుకోలేదు.. సరిగా మాట్లాడలేదు’’ అంటూ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి సమీప బంధువు, టీడీపీ నాయకుడు శిల్పా భువనేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మహానంది ఎంపీపీ చింతం నాగమణి కంటతడిపెట్టారు. ఈ ఘటన గురువారం మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వరరెడ్డి విద్య ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫర్హానాబేగం బాగా చదువుకోవడం వల్లే ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారని, ఎంపీపీ చింతం నాగమణి పెద్దగా చదువుకోకపోవడం వల్లే మాట్లాడలేకపోతున్నారని ఉదహరించి చెప్పారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఎంపీపీ చింతం నాగమణి కన్నీరు పెట్టుకుని ఏడ్చుకుంటూ బయటికి వెళ్లారు. ఆమె బయటికి రాగా అక్కడే ఉన్న ఎంపీటీసీ సభ్యులు దస్తగిరి, నాగపుల్లయ్యలు ఆమెకు సర్దిచెప్పడంతో ఆమె సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాటలను టీడీపీ నాయకులు తప్పు పట్టారు. ఇదిలా ఉండగా ఎంపీపీ నాగమణి భర్త చింతం క్రాంతికుమార్ మాట్లాడుతూ.. తన భార్య నిరక్షరాస్యురాలేమి కాదని, 2006లో ఇంటర్ పూర్తి చేశారని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే ఎంపీపీ పదవిని చేపట్టడంతో స్టేజీల మీద ప్రసంగించడానికి కాస్త భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ పదవీ లేని శిల్పా భువనేశ్వరరెడ్డి.. ప్రభుత్వ కార్యక్రమానికి ఏ హోదాలో ముఖ్య అతిథిగా వచ్చారని స్థానిక అధికారులు, విద్యావంతులు చర్చించుకున్నారు.