ఎర్రగుంట్లలో సైకిళ్లకు స్టిక్కరింగ్‌లను తొలగిస్తున్న కార్మికులు
సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ విషయం ఏడాది పాటు పట్టనట్లు వ్యవహరించిన ప్రభుత్వం.. ఎన్నికలు రావడంతో హడావుడి చేస్తోంది. ఇదంతా ఎన్నికల స్టంటేనని, బాలికల విద్యపైన ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడికొస్తా పథకంలో భాగంగా జిల్లాలోని 20 వేల మందికి పైగా బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది.
విద్యాసంవత్సరం ప్రారంభంలో (గతేడాది జూన్, జూలైలో) అందజేయాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించి.. తీరా ఎన్నికలు వస్తుండటంతో.. విద్యా సంవత్సరం ముగిసే సమయంలో సైకిళ్ల పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ఎన్నికల నగారా మోగింది. దీంతో ఈ నెల 10 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం జిల్లాలో అక్కడక్కడా సైకిళ్లు పంపిణీ చేస్తూ.. ఎన్నికల కోడ్ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వకపోగా..
విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన సైకిళ్లను ఇవ్వకపోగా.. ఇప్పడేమో తాము ఇస్తుంటే.. వైఎస్‌ఆర్‌సీపీ వారు అడ్డుకుంటున్నారనే అపవాదును వారి పైకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. విద్యాశాఖాధికారులు పంపిణీకి సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదంతా విద్యార్థులపైన ప్రేమ కాదని, ప్రభుతంపైన ఉన్న స్వామి భక్తిని చాటుకునేందుకేనని పలువురు విమర్శిస్తున్నారు. అదే విద్యా సంవత్సరం మొదట్లో పంపిణీ చేసి ఉంటే.. బాగుండేది కదా అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అటు అధికారులను, ఇటు ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు.
పంపిణీ యత్నం
కడపలోని జయనగర్‌లో మంగళవారం సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తుండగా.. ‘సాక్షి’ కంటపడటంతో విద్యాశాఖాధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించారు. ఎర్రగుంట్ల జెడ్పీ బాలికల పాఠశాలలో సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఆవరణలో సిద్ధంగా ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్లి.. ఎంఈఓ బాలశౌరమ్మ, మున్సిపల్ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి సైకిళ్లను గదిలోకి మార్పించారు. సైకిళ్ల స్టిక్కరింగ్‌లను వెంటనే తొలగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ పని చేపట్టకూడదని హెచ్‌ఎం పావనికి అధికారులు సూచించారు. సైకిళ్ల పంపిణీ చేయలేదని, కేవలం గదిలో ఉన్న వాటిని బయట ఉంచామని ఆమె చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment