సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ ఓట్ల కోసం భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బంహరి వారితో సామూహికంగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించి ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమేనని.. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని అధికారులు నిర్థారించారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదు. పైగా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉ ద్యోగులను కలవడం గానీ.. మాట్లాడడం గానీ చే యకూడదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్ప ష్టం చేస్తోంది.
దీన్ని భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం యథేచ్ఛగా ఉల్లంఘించారు. బయట వ్యక్తులకు ఇవ్వకూడని పోస్టల్ ఓటర్ల జాబితాతోపాటు వారి ఫొన్ నెంబర్లు కూడా సంపాదించి.. దాదాపు నా లుగు రోజులపాటు టెలికాన్ఫరెన్స్‌ద్వారా 500 మంది చొప్పున భీమిలి నియోజకవర్గానికి చెం దిన ఉద్యోగులతో ఒకేసారి సబ్బం హరి మాట్లాడి పోస్టల్ ఓట్లు తనకే వేయాలని ప్రలోభాలకు గురి చేశారు. దీనికి సంబంధించి ఆడియో టేపులోని ఆయన మాటలతో సహా ‘సబ్బం.. ప్రలోభాల పబ్బం’ శీర్షకతో ఇచ్చిన కథనం ద్వారా సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
విచారణ.. నిర్థారణ
ఎన్నికల నియమావళికి విరుద్దంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయనున్న ఉద్యోగుల వివరాలు సబ్బం హరికి చేరడం.. ఇందుకు కలెక్టరేట్‌లోని సంబంధిత విభాగాధికారులు కొందరు సహకరించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. డీఆర్వో గున్నయ్యను విచారణాధికారిగా నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం అధికార పార్టీ నేతలు పాల్పడుతున్న ప్రలోభాల పరంపరపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. సామూహికంగా ఉద్యోగులతో ఫోన్‌లో మాట్లాడి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లున్న ఆడియో టేపులను కూడా ఈసీకి అందజేశారు. దీనిపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది.
సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు కలిగి ఉన్న ఉద్యోగుల డేటాతోపాటు ఫోన్ నెంబర్లు ఎలా బయటకు వెళ్లాయన్న దానిపై కలెక్టరేట్‌తో పాటు భీమిలి తహసీల్దార్ కార్యాలయంలోనూ డీఆర్వో గున్నయ్య విచారణ జరిపారు. ఈ సమాచరం కలెక్టరేట్ నుంచి వెళ్లిందా? భీమిలి తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్లిందా? ఆరా తీస్తున్నారు. ఎవరి ద్వారా ఆ డేటా టీడీపీ అభ్యర్థికి చేరిందన్న దానిపై విచారణ జరుపుతున్న ఆయన.. ఆ అధికారులెవరో తేలిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఈసీకి తుది నివేదిక సమర్పించనున్నారు. మరో వైపు ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత ప్రచారం చేయడం, మూకుమ్మడిగా ఒకేసారి ఉద్యోగులందరితో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఓట్లు అభ్యర్థించడాన్ని సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. అందుకు బాధ్యుడైన టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై కూడా కేసు నమోదుకు ఈసీకి నివేదించినట్టుగా చెబుతున్నారు.
దక్షిణ నియోజకవర్గ ఆర్వో, ఏఆర్వో సస్పెన్షన్?
ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహించారన్న కారణంతో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాసమూర్తి, అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్‌ఓ) కిరణ్‌లను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment