
నల్లగా ఉన్నావు....అందంగా లేవంటూ..
ఆదోని: అందంగా లేవని వేధించినా..నచ్చలేదంటూ మానసికంగా హింసించినా ఆ మహిళ తన భర్తను వదులు కోవడానికి ఇష్టపడలేదు. పలువురి వద్ద పంచాయితీలు జరిగినా ఏడుగడుగులు నడిచిన భర్తతోనే తన జీవితం అంటూ తెగేసి చెబుతోంది. ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాల మధ్య తాను పెరిగానని, భర్తకు తగ్గట్టు నడుచుకుంటానని న్యాయం చేయాలంటూ దీక్షకు పూనుకుంది. తన కుటుంబ సభ్యులతో భర్త ఇంటి వద్దే బైఠాయించిన ఓ స్త్రీ 'చరిత' ఇది..
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన శేషమ్మ, వెంకటేశ్వరరెడ్డి దంపతుల కుమార్తె చరిత(అరుణ)కు ఏడాదిన్నర కిందట ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన చంద్రశేఖరరెడ్డితో వివాహమైంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వ్యాపారి అయిన చంద్రశేఖరరెడ్డి కుటుంబం ఆదోనిలోని తిరుమలనగర్‌లో నివాసం ఉంటోంది. ఎంటెక్ పూర్తి చేసిన చరిత హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
పెళ్లిలో చరిత తల్లిదండ్రులు కట్నకానుకల కింద చంద్రశేఖరరెడ్డికి రూ.5 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చారు. నాలుగైదు నెలలు అన్యోన్యంగా ఉన్నా. ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. వ్యాపారం కోసం డబ్బు కావాలని అడిగితే చరిత తల్లిదండ్రులు మరో రూ.2 లక్షలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని చంద్రశేఖరరెడ్డి.. భార్యను వేధించసాగాడు. "అందంగా లేవని, తన స్థాయికి తగిన సంబంధం కాదని, తనకొద్దని, ఇక ఇంటికి రావద్ద'ని చెప్పాడు. అతని తల్లిదండ్రులు చాముండేశ్వరి, రామచంద్రారెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. తానేమి తప్పు చేశానో చెప్పాలని ఆమె భర్తను నిలదీశారు. అందంగా లేకపోతే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
ఆదోనిలో కుల పెద్దలు, పోలీసులతో పంచాయితీ కూడా చేశారు. పెద్దల ముందు సరే అన్నా.. ఆతర్వాత చంద్రశేఖరరెడ్డి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇంటికి రాగానే దుర్భాషలాడడం, అవమానించడం నిత్యకృత్యం అయింది. తాను తప్పు చేసి ఉంటే చెప్పాలని, అకారణంగా ఏవో సాకులు చెప్పి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని నచ్చ చెప్పి సంసారం చేయాలనే కృత నిశ్చయంతో బుధవారం ఇక్కడి వచ్చానని ఆమె తెలిపారు.
తనతోపాటు తాత విరుపాక్షరెడ్డి, పిన్నమ్మ లక్ష్మీదేవి, చిన్నాన్న జయచంద్రారెడ్డి వచ్చారని, ఎంత వేడుకున్నా కనికరం చూపక తమను ఇంటి నుంచి బయటకు నెట్టేసి తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారని చరిత విలేకరుల వద్ద కన్నీరు పెట్టారు. తనకు భర్త సర్వస్వమని, ఆయన లేని జీవితం తనకొద్దని, భర్త, అత్త,మామలు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ విషయం ఎప్పడో చెప్పినా తనను నిరాదరణకు గురి చేయడం న్యాయం కాదని పేర్కొన్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తాని అన్నారు. కాగా ఈ ఘటనపై ఆదోని పోలీసులు స్పందిస్తూ తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపారు.