అత్త ఇంటి వద్ద బిడ్డతో ధర్నా చేస్తున్న సుస్మిత
సాక్షి, కడప(చెన్నూరు): అత్త, భర్త పెట్టే వేధింపులు భరించలేకపోవడంతోపాటు సంసారానికి తీసుకెళ్లడంలేదని ఓ వివాహిత ముండ్లపల్లె గ్రామంలోని అత్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామనపల్లె గ్రామానికి చెందిన పెడబల్లి సుబ్బారెడ్డి, సరోజనమ్మ రెండో సంతానమైన సుస్మితను ముండ్లపల్లె గ్రామానికి చెందిన బండి వెంకట కృష్ణారెడ్డి, మాధవిల కుమారుడు బండి సురేంద్రనాథ్‌రెడ్డికి ఇచ్చి పెద్దల సమక్షంలో 2020 ఆగస్టు 5వ తేదీన వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు ఇచ్చారు.
వివాహమైనప్పటి నుంచి అత్త మాధవి, భర్త సురేంద్రనాథ్‌రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సుస్మిత వాపోయింది. వివాహమైన రెండు నెలల నుంచే బిడ్డలు పుట్టలేదని, పుట్టకపోతే నా కుమారుడికి వేరే పెళ్లి చేస్తామని అత్త నన్ను మానసిక ఇబ్బందులకు గురి చేసేదని చెప్పారు. తాను గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లానన్నారు. బాబు పుట్టి తొమ్మిది నెలలైనా అత్త, భర్త ఇంటికి తీసుకెళ్లలేదని వాపోయింది.మా అమ్మానాన్నలు పెద్ద మనుషులను పంపించి తనను తీసుకెళ్లాలని చెప్పినప్పటికీ వాళ్లు ససేమిరా అన్నారన్నారు. తమ కుమార్తెను ఎందుకు తీసుకెళ్లరని, ఏ తప్పు చేసిందో చెప్పాలని నిలదీయడంతో వారు మండ్లపల్లె నుంచి కడపకు వెళ్లారన్నారు.
చదవండి: (ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పి తప్పారా లేక మరేదైనా..!)
తన భర్తను అత్త చెప్పుచేతల్లో పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తోందని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంబీఏ వరకు చదివానని, బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేశానని చెప్పారు. తనను ఉద్యోగం మాన్పించిందన్నారు. తన భర్తకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, నెలకు రూ.30 వేలు జీతం అని తెలిసి కూడా ఉద్యోగం వద్దని, ఇంటి వద్దనే వ్యాపారం చేసుకోమని సలహా ఇచ్చిందని సుస్మిత తెలిపారు. మా అత్త ఎందుకు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తోందో తెలియడంలేదన్నారు. ఇప్పుడు తొమ్మిది నెలల పసికందును కూడా చూడలేదంటే వారెంత కర్కోటకులో అర్థం చేసుకోవవచ్చన్నారు.
విజేత మహిళా మండలి అధ్యక్షురాలి సంఘీభావం
సుస్మితకు విజేత మహిళా మండలి అధ్యక్షురాలు అరుణకుమారి సంఘీభావం తెలిపి అండగా నిలిచారు. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. బాధితురాలు సుస్మిత సమస్య తన దృష్టికి రావడంతో ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment