
కోల వెంకట రమణమ్మ (ఫైల్ ఫోటో)
రాజ మహేంద్రవరం : స్వీపర్ జీతం లక్షన్నర.. ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ ఛానళ్లలో, ప్రముఖ దిన పత్రికల్లో విపరీతంగా సర్క్యూలేట్ అయిన వార్త. ఏంటి స్వీపర్‌కు లక్షన్నర జీతమా? ఎక్కడబ్బా..? నిజంగా అంత ఉందా? లేదా ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారా? అంటూ చాలా మంది అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అయితే అది నిజమే. రాజమహేంద్రవరం విద్యుత్ శాఖలో పనిచేసే కోల వెంకట రమణమ్మకి ఇంత వేతనం ఇస్తున్నారంట. ఆమె సర్వీసు 40 ఏళ్ల పైబడటంతో, వెంకట రమణమ్మ నెలకు మొత్తం రూ.1,47,722ను జీతంగా ఇంటికి తీసుకెళ్తున్నారట. 40 ఏళ్లు పైబడితే అంత జీతం వస్తుందా? మరి అందరికి రాదే? అనుకుంటున్నారా? అయితే విద్యుత్ శాఖలో పనిచేసే చాలా మంది నాలుగో తరగతి ఉద్యోగులకు లక్షకు పైబడే జీతం ఉందని తెలిసింది.
విద్యుత్ శాఖలో చేపట్టిన సంస్కరణలతో కోల వెంకట రమణమ్మకి, ఆమెతో పాటు ఆ శాఖలో ఉద్యోగం చేస్తున్న చాలామందికి వేతనాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. స్వీపర్‌కు ఆ మేర జీతం పెరగడం ఆశ్చర్యమే. స్వీపర్‌కే ఆ రేంజ్‌లో జీతాలు పెరిగితే, మరి పై స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు ఇంకెంత వేతనం పెరిగి ఉండి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ప్రారంభంలోనే రూ.40వేలు లేదా రూ.50వేలతో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందిన వారికి, సంస్కరణల పేరుతో వేతనం భారీగానే పెరిగి ఉండొచ్చు. పదవి విరమణ సమయానికి వారి వేతనాలు కూడా నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ అంచనాలు మాత్రమే.
అంత జీతమొచ్చినా.. ఆ లోటును, బాధను తీర్చలేదుగా!
కోల వెంకటరమణమ్మ, ఏమీ చదువుకోలేదు. కేవలం సంతకం పెట్టేంత అక్షరాలు మాత్రమే నేర్చుకుంది. 16 ఏళ్ల వయసులోనే అంటే 1978లో విద్యుత్ శాఖలో రోజువారీ కూలిగా చేరింది. ఆమె చేరిన మూడేళ్లకు అంటే 1981 ఏప్రిల్ 1న రమణమ్మ పర్మినెంట్ ఉద్యోగి అయింది. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలోని పని చేస్తుంది. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. చాలా కాలంగా చేసిన సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో ఉద్యోగానికి పోయి, రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్తుంది. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేశారు. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఆమెకు లక్షకు పైగా జీతం కదా..! ఇంకేం బిందాస్ లైఫ్ అనుకుంటున్నారామో...? అలా అనుకుంటే పొరపాటే. ఆమెకు ఇద్దరు కొడుకులు. భర్త రైల్వేలో పనిచేసేవాడు. ఆయన కాలం చేయడంతో, ఒక కొడుకుకి భర్త ఉద్యోగం వచ్చింది. మరో కొడుకు అనారోగ్యంతోనే బాధపడుతున్నాడు. గుండె జబ్బు, ఫిట్స్‌తో ఎప్పడికప్పుడు కొడుకుకి వైద్యం చేయించడానికే రమణమ్మ జీతం అంతా సరిపోతుంది. ఎంత జీతం వచ్చినా.. రమణమ్మకు భాగస్వామి లేని లోటును, కొడుకు అనారోగ్యం బాధను పూడ్చలేవుగా.
Comments
Please login to add a commentAdd a comment