ఏఎంహెచ్‌వో లక్ష్మీతులసి
సాక్షి, పెందుర్తి: వేపగుంటలోని జీవీఎంసీ జోన్ – 6 ప్రధాన కార్యాలయంలో శనివారం పెట్రోల్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. జోన్ – 6 ఏఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ లక్ష్మీ తులసిపై శానిటరీ సూపర్‌వైజర్ గార అన్నామణి పెట్రోల్‌తో దాడి చేసినట్లు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఏఎంహెచ్‌వోతోపాటు ఇతర అధికారుల వేధింపులు భరించలేక తానే ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ వెంట తెచ్చుకున్నానని అన్నామణి చెబుతోంది. ఇరువురి మధ్య కొంతకాలంగా ఉన్న వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీతులసి జోన్ – 6తో పాటు జోన్ – 5కు ఇన్‌చార్జి ఏఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
చినముషిడివాడకు చెందిన గార అన్నామణి జీవీఎంసీ 68వ వార్డు గోపాలపట్నంలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం జోన్ – 5 కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత వేపగుంటలోని జోన్ – 6 కార్యాలయానికి ఆమె వచ్చారు. అదే సమయంలో కార్యాలయానికి సంచితో వచ్చిన అన్నామణి తనకు అన్యాయం జరుగుతుందంటూ ఏఎంహెచ్‌వోతో వివాదానికి దిగారు. కొద్దిసేపటికి సంచిలో ఉన్న పెట్రోల్ సీసా బయటకు తీసి తనపై పోసిందని లక్ష్మీతులసి ఆరోపిస్తున్నారు.
పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద అన్నామణి, ఆమె తీసుకొచ్చిన పెట్రోల్
వెంటనే గదిలోని విద్యుత్ ఉపకరణాలు, దేవుని పటాల వద్ద దీపం ఆపడంతో పెను ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు. తాను కేకలు వేయడంతో అన్నామణిని కార్యాలయం సిబ్బంది బయటకు లాక్కుని వెళ్లారని చెబుతున్నారు. తనపై దాడి చేసిన అన్నామణిపై పెందుర్తి పోలీసులకు లక్ష్మీతులసి ఫిర్యాదు చేశారు. దీంతో అన్నామణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి లేకుండా 20 రోజులపాటు విధులకు హాజరు కాకపోవడంతో అన్నామణి జీతంలో కోత విధించారు. ఈ అంశమే వివాదానికి కారణమని సమాచారం.
వేధింపులు తాళలేకే: అన్నామణి
తన పిల్లల అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు సెలవు పెట్టినందుకు తన జీతంలో కోత విదించారని అన్నామణి అన్నారు. దీంతోపాటు చాలాకాలంగా అధికారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. శనివారం తాను ఆత్మహత్య చేసుకుందామని పెట్రోల్ తెచ్చుకున్నానని... ఎవరిపైనా దాడి చేసే ఉద్దేశ్యం తనకు లేదని వివరించారు. ఉన్నతాధికారులు కలుగజేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: రూ.3 వేల కోసం ఐదుగురి హత్య
Comments
Please login to add a commentAdd a comment