విశాఖలో చినముషిడి వాడ వద్ద జనం లేక బాబు రోడ్‌షో వెలవెల
సాక్షి, విశాఖపట్నం: పేదల సొంతింటి కల నెరవేర్చేలా అక్కచెల్లెమ్మలకు రూ.లక్షలు విలువ చేసే ఆస్తిని అందించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. మీకిచ్చే సెంటు భూమి శవాన్ని పూడ్చడానికి సరిపోతుందంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెందుర్తిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎన్టీఆర్ జంక్షన్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సెంటు భూమిలో ఇళ్లు కడతామని జగన్ చెబుతున్నారని, ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు.
ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చని అన్నారు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు ఇచ్చామని తెలిపారు. తాము కరెంట్ చార్జీలు పెంచలేదని, కరెంట్ కూడా ఒక్కసారి కూడా ఆపకుండా సరఫరా చేశామని అన్నారు. విశాఖలో వీధిదీపాలు వేసింది తానేనని, ఈ ప్రభుత్వానికి వాటికి రిపేర్లు కూడా చేసే స్థోమత లేదన్నారు.
అమరావతిని రాజధానిగా, విశాఖపట్నం ఐటీ, ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా తయారు చేస్తామని చెప్పానని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో ఏ మూల నుంచైనా అమరావతికి వచ్చి ఇళ్లు కట్టుకోవడానికి 5 శాతం భూమి రిజర్వ్ చేశానన్నారు. ఇప్పుడా భూముల అంశం సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలిపారు. అమరావతిలో తానుండే అద్దె ఇంటిని కూల్చేసేందుకు ప్రయత్నించి.. ఇప్పుడు దానిపై క్విడ్‌ప్రోకో పేరుతో కేసు పెట్టారన్నారు.
చదవండి: లోకేష్‌కు నలుగురూ వేర్వేరుగా స్వాగతం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..!
రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే తన ఒక్కడి బలమే సరిపోదని, అందరం కలిసి సమష్టిగా పోరాడాలని అన్నారు. ధనిక ముఖ్యమంత్రికి, నిరుపేదలకు మధ్య జరుగబోతున్న కురుక్షేత్ర పోరాటంలో అందరం కలిసి కౌరవుల్ని ఓడించాలన్నారు. ఇక జగన్ పని, వైఎస్సార్‌సీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా గెలవరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 కాదు.. వైఎస్సార్‌సీపీకి గుండుసున్నాయే మిగులుతుందన్నారు. నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, ధైర్యం ఉంటే.. రేపే ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. తన దగ్గర డబ్బులు లేవని వాళ్లనుకుంటున్నారని, తనది ప్రజాబలం, వాళ్లది ధనబలమని అన్నారు.
ఇంకా జనం రాలేదా?
షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వేపగుంట జంక్షన్‌కు చేరుకొని రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 4 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు.. జనం లేరని తెలిసి మారియట్ హోటల్‌కు వెళ్లిపోయారు. ఈలోగా జనాల్ని నాయకులు తీసుకొచ్చి సమాచారం ఇవ్వడంతో రోడ్ షోకు వెళ్లారు. అప్పటికీ జనం లేకపోవడంతో స్థానిక నేతలపై బాబు అసహనం వ్యక్తం చేశారు. పెందుర్తి సభకు కూడా జనాల్ని తీసుకొచ్చారు. అది కూడా చిన్న రహదారిలో రెండువైపులా హోర్డింగ్‌లు పెట్టి.. ఇరుకు రోడ్డులోనే భారీగా జనం వచ్చినట్లు షో చేసి.. మమ అనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment