ఆత్మహత్యకు పాల్పడ్డ అర్జునమ్మ
గంట్యాడ : మండలంలోని వసాది గ్రామానికి చెందిన వర్రి అర్జునమ్మ(30) భర్త వేధింపులు భరించలేక మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి గంట్యాడ ఎస్‌ఐ పి.నారాయణరావు తెలిపిన వివరాలు...వసాది గ్రామానికి చెందిన అర్జునమ్మ తన ఇంట్లో ఫ్యాన్ హుక్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అర్జునమ్మకు వసాది గ్రామానికి చెందిన వర్రి సర్వారావుతో 2013 మే 31న వివాహమైంది.
వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ ఆడ పిల్లలు కావడంతో కొన్నాళ్లుగా భర్త సర్వారావుతో పాటు ఆడపడుచు వర్రి దేవుడమ్మను వేధిస్తున్నట్టు మృతురాలి సోదరుడు సబ్బవరపు శ్రీను తమకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ డి.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్తతో పాటు ఆడపడుచును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తహసీల్దార్ నీలకంఠరావు సమక్షంలో మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. విచారణలో రూరల్ ఎస్‌ఐ రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్‌ఐ ఉపేంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment