వరలక్ష్మి (ఫైల్) కాలువలో వరలక్ష్మి మృతదేహం
బుచ్చెయ్యపేట(చోడవరం): తెల్లవారుజాము సమయం.. విపరీతమైన వాసన.. గాఢ నిద్రలో ఉన్న కుటుంబమంతా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కళ్లముందు ఏమీ కనిపించడం లేదు. విపరీతమైన కళ్లమంట. ఊపిరి అందక ఎటువెళ్తున్నారో తెలియక సమీప కాలువలో పడి మరణించింది ఓ మహిళ. భర్త పిల్లలూ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత కాలువలో పడి ఉన్న మృతదేహం వరలక్ష్మిదిగా గుర్తించారు.
18 ఏళ్ల క్రితం...
వరలక్ష్మిది గోపాలపట్నం దగ్గర వెంకటాపురం. 18 ఏళ్ల క్రితం విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి భీమవరం పంచాయతీ శివారు గొన్నవానిపాలానికి చెందిన పినపోలు వెంకటరావుతో వివాహం జరిగింది. గొన్నవానిపాలెంలో వర్షాలు కురవక, ఉపాధి కరువవ్వడంతో వరలక్ష్మి కుటుంబం వెంకటాపురానికి వలస వచ్చింది. భర్త ఆటో నడుపుతూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో వరలక్ష్మి కాలువలో పడి మరణించింది. కోడలు మృతితో గొన్నవానిపాలెంలో విషాదం అలుముకుంది. భర్త వెంకటరావు, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
రూ.కోటిపరిహారంతో అండ
ఈ సంఘటనపై వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, దొండా రాంబాబు, పినపోలు రామునాయుడు, తహసీల్దార్ మహేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారాన్ని అందస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం వరలక్ష్మి కుటంబానికి అండగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment