ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 23మంది మహిళా రైతులు ఇటీవల మహారాష్ట్రలో విజ్ఞాన యాత్రకు వెళ్లి వచ్చారు. వీరిలో ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన ఏడుగురు మహిళా రైతులతో పాటు జిల్లాలోని పెద్దేముల్, ధారూరు, గండేడ్, చేవెళ్ల తదితర మండలాలకు చెందిన మరో 16 మంది మహిళా రైతులు ఉన్నారు. ఐదు రోజుల యాత్రలో మహారాష్ట్రలోని పలు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతో పాటు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుసుకోవడం విశేషం. యాత్ర మొదటి రోజున మహారాష్ట్రలో పూనే జిల్లాలోని బారామతి గ్రామాన్ని సందర్శించారు. అక్కడి కృషి (కేవీకే) విజ్ఞాన్ కేంద్రానికి వెళ్లి అక్కడ చేపడుతున్న పలు కార్యక్రమాలను పరిశీలించారు. కేంద్రం ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ సచిన్ కలాడే ఆధ్వర్యంలో అక్కడి మట్టి పరీక్షా ల్యాబ్, మ్యూజియం, బయో ఫర్టిలైజర్, శారద మహిళా సంస్థ నిర్వహిస్తున్న మేకల పెంపకం యూనిట్‌ను, రైతుల కోసం నిర్వహిస్తున్న ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను సందర్శించారు. ఆ తర్వాత కేవీకే నిర్వహిస్తున్న నర్సరీలో దానిమ్మ, సపోటా, జామ, చింత, చెరుకు పంటలను మహిళా రైతులు పరిశీలించారు. అక్కడే ఇజ్రాయిల్ పద్ధతిలో నిర్వహిస్తున్న డెయిరీని సందర్శించారు.
పర్యావరణానికి ప్రతీకగా హజారే స్వగ్రామం రాలేగావ్‌సిద్ధి
యాత్ర లో రెండో రోజు బారామతి సమీపంలోని షల్టాన్‌లో నారీ నీంబ్‌కర్ వ్యవసాయ పరిశోధనా సంస్థను సందర్శించారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఆ తర్వాత రైతులు అక్కడే ఉన్న మేకలు, గొర్రెల పెంపకం క్షేత్రాన్ని సందర్శించారు. యాత్ర మూడో రోజున రైతులు అహ్మద్‌నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని సందర్శించారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్వగ్రామం ఇదే కావడం విశేషం. గ్రామాభివృద్ధికి అన్నా హజారే చేసిన కృషిని, కార్యక్రమాలను రైతులు పరిశీలించారు. పర్యావరణానికి ప్రతీకగా నిలిచిన ఈ గ్రామాన్ని చూసి రైతులు అచ్చెరువొందారు. మహిళా రైతులు అన్నా హజారేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి హజారే మాట్లాడుతూ గ్రామాల్లో వాటర్‌షెడ్లు నిర్మించుకోవాలని కోరారు.
వర్షం చుక్కను సద్వినియోగం చేసుకున్నప్పుడే భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రైతులకు హజారే సూచించారు. అనంతరం దేవ్‌రాలి ప్రవరా గ్రామంలో మందాతాయి చౌహాన్ అనే ఆదర్శ మహిళా రైతును కలుసుకున్నారు. ఐదుగురు పిల్లలు కలిగిన మందాతాయి తన భర్త చనిపోయినప్పటికీ అదైర్య పడకుండా తనకున్న 35 ఎకరాల భూమిని ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఎలా సాగు చేసింది వివరించింది. దీంతో ఆమె ద్వారా జిల్లా మహిళా రైతులు స్ఫూర్తి పొందారు.
ఉత్సాహం నింపిన విజ్ఞాన యాత్ర
యాత్ర నాలుగో రోజున రైతులు షిర్డీ సమీపంలోని బాబులేశ్వర్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ 600 స్వయం సహాయక సంఘాల నిర్వహణతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై శిక్షణ నిస్తారు. స్వయం సహాయక సంఘాల కార్యక లాపాలకు సంబంధించి తాంబేర్, దేవ్‌రాలి ప్రవరా గ్రామాలను మహిళా రైతులు సందర్శించారు. యాత్ర చివరి రోజు షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకొని రైతులు హైదరాబాద్‌కు తిరిగి రైలులో బయలుదేరారు. ఈ పర్యటనలో రైతుల వెంట రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు కె. సునీత, వ్యవసాయాధికారి ఆర్. శ్రీలక్ష్మీ ఉన్నారు. ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడిందని, వ్యవసాయపరంగా ఎన్నో విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నామని మహిళా రైతులు తెలిపారు.
మహారాష్ట్రలో మహిళా రైతుల పర్యటన
Published Sun, Sep 29 2013 3:02 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement