విశాఖపట్నం : ఆర్టీసీ సమ్మె బుధవారం ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. సమ్మె కారణంగా సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో జీపు బోల్తా పడింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా గూడెం కొత్త వీధి మండలం జర్రెల ఘాట్ వద్ద చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు గిరిజన మహిళలని... గునుకురాయి గ్రామానికి చెందిన ఎస్ బీమలమ్మ, పద్దురుగొండుకు చెందిన జీ గున్నమ్మ గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. చింతపల్లి నుంచి జర్రెల ఘాట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.