అవూకు : కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం కర్నూలు జిల్లా అవూకు మండలం రామపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మోషే నాపరాతి ఫాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతనికి భార్య స్వర్ణలత, ఇద్దరు అమ్మాయిలున్నారు. కాగా, వారి కుటుంబంలో గత కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే గురువారం కూడా భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో మనస్థాపం చెందిన స్వర్ణలత తెల్లవారుజామున పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఇది ఆత్మహత్య కాదని, భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని స్వర్ణలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.