అమానుషం
సీఎం సొంత జిల్లాలోబరితెగిస్తున్న తమ్ముళ్లు
చెరువు కబ్జాను అడ్డుకున్న మహిళా తహశీల్దార్‌పై దాడికి యత్నం
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు
కేసును నీరుగార్చేందుకు మాజీ మంత్రి యత్నం
ఉద్యోగ, ప్రజాసంఘాల ఆగ్రహం
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా అక్రమాలు, ఆక్రమణలకు పాల్పడుతూ తమకడ్డొస్తున్న వారి అంతుచూసేందుకూ సిద్ధపడుతున్నారు. చివరకు మహిళా అధికారులనూ లెక్కచేయడంలేదు. ఏకంగా కార్యాలయాలకే వచ్చి దాడులకు తెగబడుతున్నారు. కులాలపేర్లతో దూషిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగు చూసింది.
తిరుపతి: మొన్న కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేశాడు. ఈ ఘటన మరువకముందే తెలుగు తమ్ముళ్లు చిత్తూరు జిల్లాలో తెగబడ్డారు. తమకడ్డొచ్చిందని చిన్నగొట్టిగల్లు తహశీల్దార్ నారాయణమ్మపై దాడికి యత్నించారు.
మహిళలన్నా లెక్కలేదా?
జిల్లాలోని తెలుగు తమ్ముళ్లకు మహిళలన్నా లెక్కలేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెరు వు కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన చిన్నగొట్టిగల్లు తహశీల్దార్‌పై టీడీపీ మద్దతు సర్పంచ్ రమణారెడ్డి తెగ బడ్డాడు. సోమవారం కార్యాలయంలో కి వెళ్లి కులం పేరుతో దూషించాడు. ఆపై మహిళా అధికారి అనికూడా చూ డకుండా దాడికియత్నించాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందిం చారు. సర్పంచ్‌తో పాటు అతని అనుచరులపై శుక్రవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఆగ్రహం
మహిళా అధికారిపై దాడి ఘటన వె లుగు చూడడంతో ప్రజా సంఘాలు, రా జకీయ పార్టీల నేతలు మండిపడ్డారు.
అధికార పార్టీ నేతల తీరుపై రెవెన్యూ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కేసు నీరుగార్చే యత్నం
ఘటన శనివారం చోటు చేసుకున్నా ఫిర్యాదు చేయనీకుండా తహశీల్దార్‌పై దేశం నేతలు ఒత్తిడి తెచ్చారు. మాజీ ుంత్రి స్వయంగా కేసు వద్దుంటూ తహశీల్దార్‌ను ఆదేశించినట్లు సమాచారం. విధినిర్వహణలో దాడికి యత్నించిన వారిని ఉపేక్షిస్తే ఉద్యోగులందరికీ ఇబ్బందేనని భావించిన నారాయణమ్మ యూనియన్ నేతల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించకూడదు
అధికారులపై దాడికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఏ పార్టీ నాయకులనేది పక్కన పెట్టి అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. మహిళా అధికారి అని కూడా చూడకుండా దాడి చేయడమనేది క్షమించరాని నేరం. ఇందులో ఉన్నవారు ఎంతటి వారైనా సరే వదలకూడదు. ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
- జీ. భానుప్రకాష్‌రెడ్డి,
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ.
దళితులకు రక్షణ కరువు
టీడీపీ ప్రభుత్వంలో దళితులకు, అధికారులకు రక్షణ కరువైంది. గతంలోనూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడడం వంటిని అనేకం చోటు చేసుకున్నాయి. టీడీపీ ప్రభుత్వానికి దళితులంటే చిన్నచూపుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి ఘటనలు బాబు హయంలోనే జరుగుతున్నాయి. దాడికి పాల్పడిన వారిపై సరైన చర్యలు తీసుకుని ఉద్యోగుల్లో అభద్రతభావాన్ని తొలగించాలి.
-అశోక్ సామ్రాట్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి
ఉద్యోగులకు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం
రెవెన్యూ ఉద్యోగులు తమ విధులతో పాటు ప్రభుత్వం ఆదేశించిన అనేకరకాల అదనపు బాధ్యతలను సైతం నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు నిన్న కృష్టా జిల్లాలో వనజాక్షిపై, తాజాగా చిన్నగొట్టిగల్లులో నారాయణమ్మపై దాడులకు పాల్పడ్డారు. ఇలా అయితే మేం ఎవరికి చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి స్పందించి రెవెన్యూ ఉద్యోగులపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
-ఎం. నరిసింహులునాయుడు,
తిరుపతి రెవిన్యూ డివిజన్ గ్రామీణ, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు
అధికారులపై భౌతికదాడులు అమానుషం
అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ అవినీతి భాగోతాన్ని సాగించేందుకు అధికార పార్టీ నేతలు ప్రభుత్వాధికారులపై భౌతిక దాడులకు పాల్పడడం అమానుషం. అవినీతికి అలవాటులేని అధికారులను ఇబ్బంది పెట్టడం అధికార పార్టీ నేతలకు ఆనవాయితీగా మారింది. సామరస్యంగా చెప్పి పనులు చేయించుకోవాలిగానీ దౌర్జన్యం చేయడం నీతిమాలిన చర్య. ఇది ప్రభుత్వ దౌర్జన్యకాండకు నిదర్శనం.
-ఎ. రామానాయుడు, సీపీఐ, జిల్లా కార్యదర్శి
అవినీతి ప్రశ్నిస్తే దాడులా?
అధికార పార్టీ నాయకులు చేసే అవినీతిని ప్రశ్నించే ప్రభుత్వాధికారులపైన దాడులు సిగ్గుచేటు. ఇలాంటి దాడులను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాలు ఖండించాలి. - గంగరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి