మహిళా సభ్యులతో వాదులాడుతున్న చౌడేశ్వరి
మదనపల్లె : పసుపు–కుంకుమ డబ్బులు తనకు ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన మహిళా సంఘ సభ్యురాలు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గాంధీపురానికి చెందిన చౌడేశ్వరి శేషసాయి పొదుపు సంఘంలో ఆరు నెలల క్రితం సభ్యురాలిగా చేరింది. సంఘంలో చురుగ్గా ఉండటం, డిగ్రీ అర్హత కలిగి ఉండడంతో ఆమెను టీఎల్‌ఎఫ్ ఆర్పీగా నియమించేందుకు తీర్మానం చేశారు. ఒకరోజు విధులు నిర్వహించిన తర్వాత అర్థంతరంగా తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంఘ సభ్యులకు ‘పసుపు–కుంకుమ’ పేరిట రూ.10,000 ఇస్తున్నట్లు ప్రకటించడం, తాను సభ్యురాలిగా ఉన్న గ్రూపునకు మంజూరు చేస్తారని, తనకూ తనకు ఇస్తారని చౌడేశ్వరి ఆశలు పెట్టుకుంది.
ప్రకటించి పది రోజులవుతున్నా తనకు చెక్కులు ఎవరూ ఇవ్వకపోవడంతో కార్యాలయానికి వెళ్లి మెప్మా సిబ్బందితో వాగ్వివాదానికి దిగింది. మెప్మాలో అందరూ కలిసి తనకు అన్యాయం చేశారంటూ అక్కడ విలేకరులకు తన ఆక్రోశం వెళ్లగక్కింది. ఆపై, బయటకు వెళ్లి ఫినాయిల్ బాటిల్ తీసుకువచ్చి తాగి, అస్వస్థతకు గురైంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను తోసేసి స్పృహ తప్పి కార్యాలయంలో నేలపై పడిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లేందుకు మెప్మా కార్యాలయంలోని మహిళలెవరూ సాహసించలేదు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్ కార్యాలయానికి చేరుకుని చౌడేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. అనుకోని ఈ సంఘటనతో షాక్‌కు గురైన మెప్మా పీఆర్పీ అబ్బాస్ అస్వస్థతకు గురవడంతో ఆయనను Mకూడా ఆస్పత్రికి తరలించారు.
ఈకేవైసీ లేకనే...
ఈ విషయమై మెప్మా సీఆర్పీ మాధవిని వివరణ కోరగాగా.. శేషసాయి పొదుపు సంఘంలోని చౌడేశ్వరి, సునీతకు ఈకేవైసీ లేని కారణంగా పసుపు–కుంకుమకు అర్హులు కాలేదన్నారు. పట్టణంలో ఈ విధంగా సుమారు 2,500 మంది మహిళలకు చెక్కులు రాలేదని, పల్స్ సర్వే జరిగితే తప్ప దీనికి అర్హత రాదని, అందరూ చేయించుకోవాలని సూచించామన్నారు. చౌడేశ్వరికి కూడా ఇదే విషయం తెలియజేశామన్నారు.
పీఆర్పీపై చెప్పుతో దాడి చేసిన బాధితురాలు
సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న మహిళలను విలేకరులు ప్రశ్నించగా, చౌడేశ్వరి ఆగ్రహంగా వచ్చీ రావడంతోనే పీఆర్పీ అబ్బాస్‌పై చెప్పుతో దాడి చేసిందని పేర్కొన్నారు. అడ్డుకోబోయిన సీఓ మస్తానీని కొట్టి, ఇతర మహిళలను గాయపరిచిందని చెప్పారు. ఇదలా ఉంచితే, ఈ ఘటనపై ఇరువర్గాలను విచారణ చేసి కేసు నమోదు చేయనున్నట్లు వన్‌టౌన్ పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment