
అంగుళం వెనక్కితగ్గినా ఊరుకోం: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్/అచ్చంపేట : హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈ ప్రాంతప్రజలు తిరగబడుతారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ కోసం 13ఏళ్లు పోరాటం చేశామని, హైదరాబాద్ విషయంలో ఒక అంగుళం వెనక్కితగ్గినా ఊరుకునేది లేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో విలేకరులతో, మహ బూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రులు తెలంగాణను దొరికినకాడికి దోచుకున్నారని, ఇంకా దోచుకునేందుకు సమైక్యపాట పాడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమంతో రాష్ట్రమంతా స్తంభించి పోయినట్టుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణను అడ్డుకోవడమనే ఏకైక అజెండాతో రెండు ప్రాంతాల వారికీ తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇస్తామంటూ రచ్చబండ నిర్వహించిన సీఎం, సీమాంధ్రలో ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదన్న ఆయన.. ఇప్పుడెందుకు ఆపుతున్నారో చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంతో అక్కడి కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ ట్రావెల్స్ ఆగినాయా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టులు, పర్సంటేజీలు, చిరంజీవి సినిమాలు, లగడపాటి పైప్‌లైన్లు ఆపకుండా పేదలను మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించిన కిరణ్, ఇప్పుడు ఏపీసెట్‌ను ఎవరికోసం ఆపారని ప్రశ్నించారు. శాశ్వతంగా ఉండే రేషన్ కార్డులపై సీఎం కిరణ్ లాంటి ద్రోహుల బొమ్మలను ముద్రించొద్దన్నారు. తెలంగాణలో నాలుగేళ్ల కింద జరిగిన వడగళ్ల నష్ట పరిహారం కోసం ఇంకా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపకపోవడం దారుణమన్నారు. పదమూడేళ్లు ఉద్యమం చేస్తే మాట్లాడకుండా ముఖం చాటేసిన చంద్రబాబు 30రోజుల ఉద్యమం చేసిన సీమాంధ్రకు వెళ్లి బస్సుయాత్ర చేయడం, సమ న్యాయమంటూ ప్రధానమంత్రికి ఉత్తరం రాయడంతోనే అసలు నైజం బయటపడిందన్నారు.
టీ-కాంగ్రెస్ పనైపోయింది : జూపల్లి
మొన్నటిదాకా సమైక్యరాగం ఆలపించిన ఎంపీ రేణుకా చౌదరిని కలుపుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంకేం కొట్లాడతారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో బాబు అజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ ఆపాలని పోతున్నట్టా? హైదరాబాద్‌ను యూటీ చేయాలని అడిగేందుకు పోతున్నట్టా? వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.