కార్మికుల భద్రతే ధ్యేయం | Workers' safety comes first goal | Sakshi
Sakshi News home page

కార్మికుల భద్రతే ధ్యేయం

Published Sat, Dec 20 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

కార్మికుల భద్రతే ధ్యేయం

కార్మికుల భద్రతే ధ్యేయం

పరిశ్రమల్లో కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, యంత్రాల పనితీరుపై ప్రత్యేక  దృష్టిసారించినట్టు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (పరిశ్రమల శాఖ)అధికారి కె. రాంబాబు తెలిపారు. పరిశ్రమల యూజమాన్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలు పాటించాల్సిందేనని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు.
 

సంక్షేమం, యంత్రాల పనితీరుపైనే దృష్టి
పూర్తిస్థాయిలో జిల్లాలో రెన్యూవల్స్
పరిశ్రమల యూజమాన్యాలు నిబంధనలు పాటించాల్సిందే
‘సాక్షి’తో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో ఇప్పటి వరకు 1238 ఫ్యాక్టరీలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాటిలో విద్యుత్ సమస్య, నష్టాలు, కోర్టుల్లో లావాదేవీల కారణంగా 270 ఫ్యాక్టరీల్లో ఉత్తత్పి నిలిచిపోయింది. మిగిలిన 968 ఫ్యాక్టరీలకూ ఈ ఏడాది పూర్తిస్థాయిలో రెన్యూవల్స్ చేయించామని రాంబాబు తెలిపారు. కొత్తగా ఈ ఏడాది మరో 20 ఫ్యాక్టరీలకు లెసైన్సులు మంజూరు చే శామన్నారు. గతంలో సుమారు 280 ఫ్యాక్టరీలు రెన్యూవల్స్ లేకుండానే నడిచినట్టు తమ దృష్టికి వచ్చిందని, కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, యంత్రాల పనితీరు పరిశీలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిస్థాయిలో రెన్యూవల్స్ చేయించామన్నారు. 31 పరిశ్రమలు మూతపడే దిశగా ఉన్నాయన్నారు.
 
సిబ్బంది కష్టాలు తప్పడం లేదు
జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో కార్మికుల జీతాలు, వేతనాల అమలు తీరును పరిశీలించేందుకు కార్మికశాఖ చట్టాల్ని అమలు చేస్తుండగా అక్కడి కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. జిల్లా కార్యాలయంలో ఆరు పోస్టులుండగా వాటిలో రెండు పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వాస్తవానికి వేల సంఖ్యలో ఉన్న పరిశ్రమల తీరును పరిశీలించేందుకు కనీసం పదిమంది సిబ్బంది ఉండాల్సిందేనని రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన వివిధ సమావేశాల్లో జిల్లా పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అలాగే పరిశ్రమల శాఖ నిబంధనల్ని సడలించేందుకు, కాంపౌండింగ్ ఫీజును పెంచే విషయంలో కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించే స్వల్ప ఫీజుల విషయంలో కూడా కొంతమంది కోర్టుల్ని ఆశ్రయిస్తున్నట్టు సమాచారముందన్నారు. అయితే తాము మాత్రం వివిధ పరిశ్రమల అధికారులు, యాజమానుల్ని చైతన్యవంతం చేస్తున్నామని, నిబంధనల్ని పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నట్టు రాంబాబు పేర్కొన్నారు.
 
ఇవీ రిజిస్ట్రేషన్ల కమామిషు
1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ సెక్షన్ 2 ఎం (1) ప్రకారం విద్యుత్ వినియోగిస్తూ పదిమంది కంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులతో పనిచేయిస్తుంటే దానిని ఓ పరిశ్రమగా (మ్యాన్‌ఫ్యాక్చురింగ్ యూనిట్) గుర్తించొచ్చు. అదే విధంగా విద్యుత్ వినియోగం లేకుండా 20 అంత కంటే ఎక్కువ మందితో ఉత్పత్తి చేయిస్తుంటే సెక్షన్ 2 ఎం (2) ప్రకారం ఓ పరిశ్రమగా గుర్తించొచ్చు. అయితే జిల్లాలో చాలా చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తూ పరిశ్రమలేర్పాటు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఇకపై స్పెషల్‌డ్రైవ్ ద్వారా పరిశ్రమల్ని గుర్తించేందుకు సిద్ధమయ్యామని రాంబాబు తెలిపారు. సెంట్రల్ యాక్ట్ ప్రకారం (స్పెషల్ యాక్టు కూడా) పోలీసుల సహాయం లేకుండానే ఏదైనా ఓ పరిశ్రమను తనిఖీ చేసేందుకు, నిబంధనలు ఉల్లంఘిచే వారిపై చర్యలు తీసుకునేందుకు తమకు అధికారం ఉందని స్పష్టం చేశారు.

1961 యాక్ట్ ప్రకారం మెటర్నిటీ బెనిఫిట్స్ కింద మహిళలకు సెలవుతో కూడిన వేతనం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం సంస్థ యాజమాన్యం సరైన సమయానికి జీతాలివ్వకపోయినా కార్మికులు తమను సంప్రదించవచ్చని రాంబాబు కోరారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు యంత్ర సామగ్రి పెరిగిందని, సాంకేతిక పరిజ్ఞానం భారీగా అందుబాట్లోకి రావడంతో కార్మికుల సంఖ్య తగ్గిందని అభిప్రాయపడ్డారు. అయితే భద్రతను దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 7 (ఏ, డీ) ప్రకారం నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిశ్రమల్లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో కార్మికులు, యాజమాన్యాలు, సంస్థ ఉద్యోగులు తమ ఇబ్బందుల కోసం సంప్రదించవచ్చన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement