
ప్రైవేటు భవనంలో ఉన్న ఈఎస్‌ఐ వైద్యశాల
మార్కాపురం: డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో ఈఎస్‌ఐ వైద్యశాల ఏర్పాటు కలగా మారుతోంది. మార్కాపురం రెవెన్యూ అధికారులు హాస్పిటల్ కోసం పట్టణ నడిబొడ్డున కంభం సెంటర్‌లో ఉపయోగంలో లేని రోడ్డు భవనాల శాఖ కార్యాలయాన్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈఎస్‌ఐ అధికారులకు గత ఏడాది జూన్‌లో సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి ఫైనల్ చేస్తే ఆ భవనాన్ని ఈఎస్‌ఐ వైద్యశాలకు కేటాయిస్తారు. అయితే ఈఎస్‌ఐ అధికారులు ఎప్పుడు వస్తారో తెలియలేదు. గత ఏడాది నుంచి అప్పుడోస్తాం, ఇప్పుడోస్తామంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈఎస్‌ఐ అధికారులు రాకపోవటంతో ఖాళీగా ఉన్న ఈ భవనంలో పలువురు తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురం పట్టణంలో సుమారు 40 పలకల ఫ్యాక్టరీల్లో, గనుల్లో కలిపి 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 1500 మంది కార్మికులకు ఫ్యాక్టరీల యజమానుల ద్వార ఈఎస్‌ఐ వైద్యశాలలో సభ్యత్వం ఉంది. ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో కార్పొరేట్ వైద్యం ఉచితంగా లభిస్తోంది. మార్కాపురంలో వైద్య సదుపాయాలు లేకుంటే ఈఎస్‌ఐ ఒప్పందం చేసుకున్న లింక్ హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, ఒంగోలు, హైదరాబాదుల్లోని కార్పొరేట్ వైద్యశాలలకు రిఫర్ చేస్తారు. దీని వల్ల వలన ఉన్నతమైన చికిత్స కార్మికులకు దక్కుతుంది.
పలకల కార్మికులతో పాటు డివిజన్‌లోని వివిధ షాపుల్లో, పప్పుల, బొరుగుల బట్టీల్లో, బలపాల ఫ్యాక్టరీలు, వస్త్ర దుకాణాల్లో కలిపి సుమారు 4వేల మంది వరకు పనిచేస్తుంటారు. వీరిలో కొంత మందికి మాత్రమే యజమానులు కార్మికులుగా గుర్తించి ఈఎస్‌ఐలో నమోదు చేయించారు. యజమాని కార్మికునిగా గుర్తిస్తే ప్రతి ఏటా ప్రభుత్వానికి సభ్యత్వం చెల్లించాలి. యజమాని వాటా 4.75 శాతం, కార్మికుని వాటా 1.25 శాతంగా ప్రభుత్వానికి చెల్లించాలి. జిల్లాలో మార్కాపురం, చీరాల, మార్టూరుల్లో ఈఎస్‌ఐ వైద్యశాలలు ఉన్నాయి. డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే కార్మికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఐ హాస్పిటల్ కోసం ఇక్కడి కార్మికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment