కడప.. ఇక ప్రగతి గడప | Working With Vision On Chief Minister YS Jaganmohan Reddys Own District Development | Sakshi
Sakshi News home page

కడప.. ఇక ప్రగతి గడప

Published Wed, Jul 10 2019 7:22 AM | Last Updated on Wed, Jul 10 2019 7:22 AM

Working With Vision On Chief Minister YS Jaganmohan Reddys Own District Development - Sakshi

కడప అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది వైఎస్‌ రాజశేఖరరెడ్డి. అంతటి ముద్రను వేసుకున్నారు దివంగత నేత. నాయకత్వ లక్షణాలతో.. సొంత జిల్లా అభివృద్ధిలో తన దైన పంథాలో నడిచారు. పుట్టిన గడ్డ రుణం  తీర్చుకునేందుకు సీఎంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఔరా అనిపించుకున్నారు. ఆయన మరణానంతరం జిల్లాను గాలికొదిలేశారు పాలకులు. పదేళ్ల తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
జిల్లాను ప్రగతి బాటలో నడిపించేందుకు దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. సీఎం అయ్యాక సోమవారం తొలిసారిగా వచ్చిన ఆయన చేసిన ప్రకటనల్లో ఈ విషయం సుస్పష్టంగా నిపించింది. జిల్లాఅభివృద్ధికి ఎన్ని చేయాలో అన్నీ చేయాలనే పట్టుదల జగన్‌లో ప్రస్ఫుటమైంది.

సాక్షి ప్రతినిధి కడప: కడప జిల్లాకు ‘దశ–దిశ’గా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలవనున్నారు. సొంత జిల్లా అభివృద్ధి విషయంలో ఒక విజన్‌తో ఆయన పనిచేసుకుపోతున్నారు. అన్ని విధాలా జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు కార్యోన్ముఖుడై కదులుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, నిలిచిపోయిన నీటి ప్రాజెక్టులకు జీవం, చెన్నూరు షుగర్స్‌ పునరుద్ధరణ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర అంశాలలో స్పష్టమైన ప్రణాళికతో అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కడప గడ్డపై అడుగుపెట్టిన  జగన్‌మోహన్‌ రెడ్డి జిల్లా వాసుల అంచనాలకు తగ్గట్లుగా నిర్ణయాలు ప్రకటించారు. ప్రతిష్టాత్మక నవరత్నాల పథకాలను ఈ గడ్డపై నుంచే ప్రారంభించారు. పెండింగ్‌ పథకాలపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటించడం జిల్లావాసులకు సంతోషాన్ని కలిగించింది. చెప్పడం కాదు చేసి చూపెడతానంటూ అందుకు డిసెంబర్‌ 26  ముహూర్తం కాగలదని తెలియజెప్పారు. 

కేసీ కెనాల్‌ ఆయకట్టుకు జీవం..
కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్‌ 24న రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణానికి పెద్దముడియం మండలంలో శుంకుస్థాపన చేశారు. 2.96 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి రిజర్వాయర్, కోవెలకుంట్ల సమీపంలో 0.90 టీఎంసీ సామర్థ్యంతో జొలదరాశి రిజర్వాయర్లు నిర్మించేందుకు, రూ.434 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. మరుచటి ఏడాది మృతి చెందడంతో రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణానికి పుల్‌స్టాప్‌ పడింది. ఆప్రాజెక్టు పూర్తయితే కుందూ నదిలోని వరద జలాలను నిల్వ చేసుకోవచ్చు. అవసరమైన సమయంలో వాటిని కేసీ కెనాల్‌కు ఉపయోగించుకునేందుకు వీలుండేది. కేసీ కెనాల్‌తోపాటు ప్రొద్దుటూరు, కడప నగరం దాహార్తి తీర్చుకునేందుకు అవకాశం దక్కేది. దాహార్తికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సమయంలో పెన్నాకు కూడా నీరు లభించేది.

కేసీ కెనాల్‌ పరిధిలో దాదాపు 95వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడేది. కుందూలో వరద నీరు పుష్కలంగా ఉంటుంది. ఏటా దాదాపుగా 50టీఎంసీలకు పైగా సోమశిల రిజర్వాయర్‌ చేరుతోంది. ఈ పరిస్థితిలో రాజోలి సమీపంలో 3టీఎంసీలు నీరు నిల్వ చేయగల్గితే కేసీ కెనాల్‌ ఆయకట్టు పరిధిలో పంటలకు ఎలాంటి డోకా ఉండదు.  ఇదే విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఏడాది డిసెంబర్‌ 26న ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.  నిరుపయోగంగా ఉన్న బ్రహ్మంసాగర్‌ను నీటి నింపేందుకు ప్రణాళికలు రచించారు. కుందూ వరద జలాలను ఎత్తిపోతల ద్వారా తెలుగుగంగ కాలువకు తరలించి, బ్రహ్మంసాగర్‌ నింపుతామని వివరించారు. కృష్ణా జలాలు వరద ఉదృతి ఆధారంగా గండికోట ప్రాజెక్టులో 20టీఎంసీల నీరు నిల్వ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించి ఊరట కల్పించారు. 

పులివెందుల కేంద్రంగా అరటి పరిశోధన..
అరటి పంటను అపారంగా పండించే పులివెందుల ప్రాంతంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్శిటీకీ అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. రూ.10కోట్లుతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మెరుగైన దిగుబడులు ఈ ప్రాంత వాతావరణానికి అనువైన రకాలను ఎంపిక చేసి ఉద్యాన అధికారులు పరిశోధన చేయనున్నారు. తాగునీరు, సాగునీరు, అనువైన పంటలు ఏర్పాటు, ఉపాధి అవకాశాలు, మౌళిక వసతులు కల్పించాలనే సంకల్పం ముఖ్యమంత్రి మదిలో ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దశాబ్దకాలంగా జిల్లాను వివక్షతకు గురిచేసిన పాలకుల కనువిప్పు కల్గేలా జిల్లాభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పలువురు విశ్వసిస్తున్నారు. 

ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం...
కడప జిల్లా వాసుల కల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు. దీనిని  నెలకొల్పాలనే కృతనిశ్చయం ఆయన మాటల్లో కనిపించింది. దీనిద్వారా వెనుకబడిన ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేతగా గతంలోనే ప్రకటించారు. సీఎం అయ్యాక తాను మాట ఇచ్చిన ప్రకారం డిసెంబర్‌ 26న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని ప్రకటించడంతోనిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. మూతబడిన చెన్నూారు చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు రూ.60కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం చేసిన ప్రకటన సహకార రంగానికి ఊపిరులూదినట్టయింది. చెరుకు రైతులకు అండగా నిలవాలనే దిశగా ప్రభుత్వ చర్యలు వేగంగా సాగుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement