
మొన్న అసాధ్యం.. నిన్న కల.. నేడు ఆవిష్కరణ.. వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణానికి ముప్పు వస్తే కాపాడేది వైద్యుడే. తీవ్రతను బట్టి మందులు.. శస్త్రచికిత్సలతో పునర్జన్మను ఇస్తున్నారు. మానవ శరీరంలో అవయవాలు పాడైతే కృత్రిమమైనవి అమర్చి ప్రాణాలు నిలుపుతున్నారు. వైద్యుల్లో గుండెలు తీసిన బంట్లు ఉన్నారు. రికార్డు స్థాయిలో ఆపరేషన్లు చేసి చరిత్రకెక్కిన వారు ఉన్నారు. ఇలా ఎంతో మంది వైద్యులు ఉన్నా శస్త్రచికిత్సలో మత్తు మందు డాక్టర్ల పాత్ర ఎంతో కీలకం. రోగికి నొప్పి, బాధ తెలియకుండా గమ్మత్తుగా ఆపరేషన్లు చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతమే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అనెస్తీషియా రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ప్రత్యేక కథనం.
కర్నూలు (హాస్పిటల్): పూర్వం శాస్త్రీయ మత్తు విధానాలు అనుసరించకుండా అశాస్త్రీయ పద్ధతుల్లో శస్త్రచికిత్సలు నిర్వహించేవారు. అందువల్ల తక్కువ శాతం శస్త్రచికిత్సలు విజయవంతం అయ్యేవి. ఒకవేళ విజయవంతం అయినా ఆపరేషన్ తర్వాత రోగి కోలుకోవడంలో సమస్యలు ఉత్పన్నం అయ్యేవి. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మసెచ్యూసెట్ ఆసుపత్రిలో 1846 అక్టోబర్ 16వ తేదీన డబ్ల్యూటీజీ మోర్టాన్ అనే వైద్యులు గిల్బర్ట్ అబోట్ అనే రోగిపై ఈథర్ వాయువును ప్రయోగించారు. ఆ తర్వాత రోగి మెడపై ఉన్న కణితిని ఏ మాత్రం నొప్పి, బాధతెలియకుండా డాక్టర్ హెద్రీబెగ్లో అనే సర్జన్ విజయవంతంగా తొలగించారు. ఈ పరిణామం వైద్యశాస్త్రంలో అద్భుతం ఆవిష్కరించడమే గాకుండా మత్తు వైద్యవిభాగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. ఆ తర్వాత పలు రకాలైన మత్తు ఔషధాలు, పరికరాలు ఆవిష్కరించడం ద్వారా పలు రకాలైన నూతన శాస్త్రీయ మత్తు విధానాలు అవలంంభించడం ద్వారా వైద్య శాస్త్రంలో మత్తు విభాగం ప్రాముఖ్యత విస్తరించి, కీలకమైన విభాగంగా ఆవిష్కరించింది.
కర్నూలులో 1958 నుంచే..
కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 1958లో ఈ విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 26వేల మందికి ఆపరేషన్ సమయంలో మత్తు మందు ఇస్తున్నారు. సాధారణ శస్త్రచికిత్సలకే గాకుండా అన్ని రకాలైన స్పెషాలిటిస్‌కు సంబంధించిన శస్త్ర చికిత్సలతో పాటు మానసిక రుగ్మతలకు ఈసీటీ, జీర్ణకోశ విభాగంలో ఈఆర్‌సీపీ, రేడియాలజీ విభాగంలో సీజేఎంఆర్‌ఐ, న్యూరోసర్జరీ విభాగంలో పెయిన్ క్లినిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. కార్డియోథొరాసిక్ విభాగంలో 120కి పైగా కేసులకు విశిష్టమైన సేవలు అందిస్తోంది. ఇందులో 25 మందికి గుండె కవాటాల మార్పిడి, 30 మందికి కరొనరి బైపాస్‌లు, 9 మందికి గుండెలో రంధ్రాలు రిపేరి, 5గురికి రక్తనాళాలు, ఏడుగురికి ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెయిన్‌క్లినిక్‌ను ఆధునీకరించి మెరుగైన సేవలు అందించేందుకు గైనకాలజి విభాగంలో ప్రత్యేక ఐసీయు నెలకొల్పేందుకు, క్యాన్సర్ చికిత్సకు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఎస్‌ఏ రాష్ట్రస్థాయి సమావేశాలు విజయవంతంగా నిర్వహించారు.
నొప్పులను తగ్గించే ‘పెయిన్ క్లినిక్‌లు’
=నొప్పి అనేది శరీరంలో జరిగే అసాధారణ చర్యలను సూచించే ఒక లక్షణం. నొప్పిని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి తీవ్రమైన నొప్పి, రెండు దీర్ఘకాలిక నొప్పి. దీర్ఘకాలిక నొప్పి వ్యవధి మూడు నెలలకు పైగా ఉంటుంది. దీని వల్ల మన శరీరం భావోద్రేక, ఇంద్రియ, హార్మోనల్ అసమతుల్యతకు లోనై మాంద్యము, మందులకు స్పందించకపోవడం, నిద్రలేమి వంటి వాటితో జీవితపు నాణ్యత లోపిస్తుంది. అందువల్ల నొప్పిని ఐదవ కీలక సూచనగా అభివర్ణిస్తారు. ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేయడానికి పెయిన్ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయి. పెయిన్ క్లినిక్స్‌లో దీర్ఘకాల నొప్పులకు ఆధునిక పరికరాలు (ఎక్స్‌రే మిషన్, సిటి స్కానింగ్ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మిషన్)ను ఉపయోగించి కుట్లులేని ప్రత్యేకమైన ఇంజెక్షన్లు ద్వారా నొప్పి తగ్గిస్తారు. ఇందులో భాగంగా నడుంనొప్పికి, మోకాలునొప్పికి, మెడనొప్పికి, తలనొప్పికి, క్యాన్సర్ నొప్పులకు చికిత్స చేసి నొప్పి తగ్గిస్తారు. అలాగే సాధారణ కాన్పుల వల్ల కలిగే నొప్పులకు లేబర్ అనెల్జిషియా పద్ధతితో నొప్పిలేని కాన్పుగా చేస్తారు. ఆధునిక పరికరాల సహాయంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అనెస్తీషియా విభాగం ఆధ్వర్యంలో పెయిన్ క్లినిక్ స్థాపించి న్యూరోసర్జరీ ఆపరేషన్ థియేటర్‌లో చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక నెల వ్యవధిలో 20 మందికి ఈ చికిత్సలు చేశారు.
నేడు అనెస్తీషియా దినోత్సవ వేడుకలు
కర్నూలు సొసైటీ ఆఫ్ అనెస్తీషియా ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ ఆధ్వర్యంలో వరల్డ్ అనెస్తీషియా డే వేడుకలను ఈ నెల 16వ తేదీ రాత్రి 8 గంటలకు స్థానిక బళ్లారి చౌరస్తాలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌లోని సెంచురీ హాస్పిటల్స్ చీఫ్ అనెస్తీషియాలజిస్ట్ డాక్టర్ టి. సునీల్ పాండ్య హాజరవుతారు. ఈ సందర్భంగా నిర్వహించే సైంటిఫిక్ సెషన్‌లో అనెస్తీషియా విభాగంలో వస్తున్న మార్పులపై ఆయన ప్రసంగిస్తారు. అంతకుముందు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అనెస్తీషియాలజీ క్రిటికల్ కేర్ అండ్ పెయిన్ మెడిసిన్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో మధ్యాహ్నం 12 గంటలకు అనెస్తీషియా డే నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముంబయిలోని లలితావతి హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ పి. జగన్నాథ్ హాజరుకానున్నారు.
– డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, అనెస్తీషియా విభాగం హెచ్‌వోడి, కేఎంసీ, డాక్టర్ రామశివనాయక్ , అనేస్తీషియా వైద్యులు
ఏటా 76 వేలకు పైగా రోగులకు శస్త్రచికిత్సలు
జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, నందికొట్కూరు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటన్నింటిలో ఆపరేషన్ థియేటర్లు అక్కడి అనెస్తీషియా విభాగం, వైద్యుల ఆధీనంలో ఉంటాయి. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ఏటా 26వేల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. మిగిలిన మొత్తం ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 50వేలకు పైగానే ఉంటుంది. అంటే ఏడాదికి అన్ని ఆసుపత్రుల్లో కలిపి 76వేలకు పైగా రోగులకు ఆపరేషన్లు నిర్వహించడంలో అనెస్తీషియా వైద్యులే కీలక పాత్ర పోషిస్తారు. ఆపరేషన్ థియేటర్లలో రోగికి మత్తు ఇవ్వడమే గాక అత్యవసర విభాగాల్లో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించడం, ఆఖరి క్షణాల్లో రోగులకు శ్వాస, రక్త ప్రసరణ పునరుద్ధరించడంలో మత్తు వైద్యసేవలు ప్రధాన భూమిక పోషించడం ద్వారా క్రిటికల్ కేర్ విభాగంలో కీలకంగా మారింది. ప్రమాదాలు సంభవించినప్పుడు ట్రామాకేర్‌లోనూ, ప్రకృతి విలయాల్లోనూ, మాస్ క్యాజువాలిటిల్లో ముఖ్యభూమిక పోషించడం ద్వారా వైద్యరంగంలో అనెస్తీషియా వైద్యులు కీలకంగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment