ప్రపంచ బ్యాంక్ నిధులతో రోడ్ల నిర్మాణం
కర్నూలు (అర్బన్):
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రోడ్లను ప్రపంచ బ్యాంక్ నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అన్నారు. కర్నూలు నుంచి దేవనకొండ వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు కేఈతోపాటు రోడ్లు, రవాణా శాఖమంత్రి సిద్ధా రాఘవరావు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక బళ్లారి రోడ్డులోని రేడియో స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేఈ మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడకుండా రోడ్లను మలేషియా తరహాలో నిర్మించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రపంచ బ్యాంక్ నిధులు రూ. 133.54 కోట్లతో రోడ్లను రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ భవిష్యత్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి నివేదికలను తెప్పించుకున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు ఇబ్బందికరంగా మారాయని, నిధులు మంజూరు చేసి కొత్త రోడ్లు నిర్మించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ మాట్లాడుతూ ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందన్నారు. ఎమ్మెల్సీలు ఎం.సుధాకర్‌బాబు, డాక్టర్ గేయానంద్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఎం.మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎస్పీ ఆకే రవిక్రిష్ణ, ఏపీఆర్‌డీసీ ఎండీ జగన్నాథరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజీవ్‌రెడ్డి, ఆర్‌డీసీ, ఆర్‌అండ్‌బీ ఈఈలు నాగరాజు, ఉమామహేశ్వర్, డీగఈఈ శ్రీధర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ మూర్తి, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.