మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజినల్ డైరెక్టర్ బెంజ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. మానవ వనరులపై పెట్టుబడుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, వాస్తవిక అభివృద్ధి సిద్ధిస్తుందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. సచివాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్‌తో దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజినల్ డైరెక్టర్ షెర్ బర్న్ బెంజ్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంకు బృందం భేటీ అయ్యింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేసిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రను ప్రపంచ బ్యాంకు బృందం ప్రస్తావించింది. క్షేత్ర స్థాయిలో చూసిన అనేక సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు తన పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారన్న విషయాన్ని తాము తెలుసుకున్నామని వెల్లడించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను సీఎం వారికి సమగ్రంగా వివరించారు.
విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. వీటిని ఇంటర్‌నెట్ ద్వారా కలెక్టరేట్లతో అనుసంధానం చేశామని, వచ్చే మూడేళ్లలో భూముల రిజిస్ట్రేషన్ కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలు, ఒక నర్సు, ఒక ఏఎన్‌ఎంతో నిత్యం వైద్యం అందించేలా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో గ్రామాల్లో సమగ్ర మార్పులను తీసుకు వస్తామన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2 వేల వ్యాధులకు చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇప్పుడున్న 11 బోధనాసుపత్రులను 27కు పెంచుతున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెరిగేందుకు పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి, విద్యా వసతి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరుగుతాయని వివరించారు. తద్వారా వలసలు తగ్గి నగరాలు, పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజినల్ డైరెక్టర్ బెంజ్
తల్లిదండ్రులకూ విజ్ఞానాన్ని పంచేలా..
చివరి ఏడాది మరో వినూత్న కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నట్లు సీఎం జగన్ ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. విద్యార్థులకు ఇంటర్‌నెట్ కనెక్షన్‌తో కూడిన ట్యాబ్ ఇచ్చి, డిజిటల్ క్లాసులతో అనుసంధానం చేస్తామన్నారు. వీటి ద్వారా వారు నేర్చుకోవడమే కాకుండా, వ్యవసాయం సహా ఇతర అంశాల్లో తల్లిదండ్రులకు అవసరమైన విజ్ఞానాన్ని పంచడానికి వీలుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం సమూల మార్పులను తీసుకు రావడానికి ఉపయోగపడుతుందని సీఎం ఆకాక్షించారు.
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి ఇటీవల అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా సీఎం జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో లెజిస్టేటివ్ కేపిటల్, కర్నూలులో జుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఒక్క అమరావతి ప్రాంతంలోనే మౌలిక వసతులకు రూ.1.9 లక్షల కోట్లకు పైగా వెచ్చిస్తే, మిగతా ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. అందుకే ఇప్పటికే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్న విశాఖలో పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ నగర స్థాయిని మరింతగా పెంచుతుందన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టేవారు ఆసక్తి చూపిస్తారని, భవిష్యత్తులో పెద్ద నగరాలతో పోటీపడే స్థాయికి చేరుకుంటామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు హెల్త్, న్యూట్రిషన్ అండ్ పాపులేషన్ లీడ్ ఎకనమిస్ట్ డాక్టర్ అజయ్ టాండన్, లీడ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ షబ్నం సిన్హా, సీనియర్ హెల్త్ స్పెషలిస్ట్ మోహినీ కక్, సీనియర్ స్పెషలిస్ట్‌లు కార్తీక్ పెంటల్, ప్రవేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, సీఎం కార్యాలయ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, డాక్టర్ పీవీరమేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు భేష్ : ప్రపంచ బ్యాంకు బృందం
– నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చేపట్టడం మంచి పరిణామం.
– ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్ కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు సంస్థల ఏర్పాటు ప్రశంసనీయం.
– గ్రామ, వార్డు సచివాలయాలు కలెక్టరేట్లు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానంతో పాలన వేగవంతం.
– సచివాలయాలకు డేటా అందుబాటులో ఉంచడం వల్ల చక్కటి ఫలితాలొస్తాయి.
– ఆరోగ్యం, విద్య, వైద్యం సహా పలు రంగాల్లో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకం. ఈ అంశాల్లో తగిన విధంగా సహాయం అందిస్తాం.
– నాలుగు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసి, ఇతరత్రా ఏయే కార్యక్రమాలకు సహాయం అందించాలన్నదానిపై ఒక అవగాహనకు వస్తాం.
Comments
Please login to add a commentAdd a comment