రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’ | Central Govt has decided that the state government is the sole authority of state capital | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’

Published Wed, Feb 5 2020 4:03 AM | Last Updated on Wed, Feb 5 2020 8:29 AM

Central Govt has decided that the state government is the sole authority of state capital - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి మద్దతు పలికింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది.

ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ లోక్‌సభకు మంగళవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. దీంతో టీడీపీ వాదనలన్నీ ప్రజలను పక్కదారి పట్టించేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని అంశంలో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుయుక్తి బెడిసికొట్టింది. లోక్‌సభ వేదికగా టీడీపీ వేసిన పాచిక వారికే ఎదురుతిరిగింది. రాష్ట్ర రాజధాని అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానమివ్వడంతో ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనదేనని స్పష్టమైంది. నిత్యానంద్‌రాయ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. 

కేంద్రం స్పందన ఏమిటి?: గల్లా 
రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ రాజకీయ ఎత్తుగడ వేసింది. ఈమేరకు ఎంపీ గల్లా జయదేవ్‌ రాజధానిపై కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో ప్రశ్నలు వేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? వస్తే దీనిపై కేంద్రం స్పందన ఏమిటి?  ఈ నిర్ణయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సహాయపడుతుంది? పెట్టుబడుల వాతావరణం దెబ్బతినడమే కాకుండా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టం వాటిల్లుతున్నందున ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుందా? ఇస్తే అందుకు సంబంధించి వివరాలేమిటి?’ అని గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు. టీడీపీకి చెందిన మరో సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) అమరావతిలో నిరసన అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తూ ప్రశ్న అడిగారు. ‘అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో సామూహిక నిరసనలు జరుగుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందా? నిరసనకారులపై పోలీసుల దాడులు కేంద్రం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? ఈ విషయంలో జోక్యం చేసుకునే యోచన ఉందా?’ అని అడిగారు. 

రాజధాపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
మూడు రాజధానుల అంశంపై టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.  ‘తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది’ అని విస్పష్టంగా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని నగరంగా అమరావతిని నోటిఫై చేస్తూ 2015 ఏప్రిల్‌ 23న జీవో జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది..’ అని పేర్కొన్నారు.

శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం
శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని కూడా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈమేరకు టీడీపీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ప్రజల భద్రత, పోలీసింగ్‌ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశాలు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, చట్టప్రకారం అపరాధులపై చర్యలు తీసుకునే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో శాంతి భద్రతల స్థితిని పర్యవేక్షిస్తుంది. భారీగా శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లైతే రాష్ట్రాల అభ్యర్థన మేరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్‌) పంపడం ద్వారా సాయం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనేదీ కేంద్ర హోం శాఖకు ఇంతవరకూ రాలేదు’ అని వివరించారు. 

రాజకీయ లబ్ధికి టీడీపీ పాట్లు
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలన, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని మొదటి నుంచీ చెబుతోంది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలనా రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. కానీ దీనికి వక్రభాష్యం చెబుతూ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. తమ అనుకూల మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. బీజేపీలో చంద్రబాబు కోవర్టు సుజనా చౌదరి తదితరులు కూడా టీడీపీ వాదనను వినిపిస్తూ వికేంద్రీకరణను అడ్డుకుంటామని చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. 

కేంద్రం ప్రకటనపై హర్షాతిరేకాలు..
మూడు రాజధానుల విధానానికి అనుకూలంగా ప్రజా మద్దతు పెరుగుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా ‘రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. అందులో కేంద్రం ప్రత్యేకంగా జోక్యం చేసుకోదు. నిబంధనల మేరకే వ్యవహరిస్తుంది’ అని చెబుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగానే కీలక ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ విధానానికి ఇటు ప్రజలు సంపూర్ణంగా మద్దతిస్తుండటం అటు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని పేర్కొంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement