
ఆహార భద్రతతో ప్రపంచ శాంతి: స్వామినాథన్
వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్
తిరుపతి, న్యూస్‌లైన్: మానవాళి శ్రేయస్సుకు ఆహారభద్రత అవసరమని, ఆహార భద్రతతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతోందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, గ్రీన్ రివల్యూషన్ పితామహులు ఎంఎస్.స్వామినాథన్ అన్నారు. తిరుపతిలోని రాష్ట్రీ య సంస్కృత విద్యాపీఠంలో బుధవారం మాడభూషి అనంతశయనం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్, సొసైటీ ఫర్ హంగర్ ఎలిమినేషన్ సంస్థలు సదస్సు నిర్వహిం చాయి. సదస్సులో స్వామినాథన్ మాట్లాడుతూ ఆకలిని నిర్మూలిస్తేనే ప్రపంచశాంతి లభిస్తుందన్నారు.
మనుషులు ఆకలితో అలమటిస్తుంటే శాంతిని తీసుకు రాలేమని చెప్పారు. 2013లో అమలులోకి వచ్చిన ఆహార భద్రత బిల్లు ఆకలి నిర్మూలనకు దోహదపడుతుందని చెప్పారు. 1943లో బెంగాల్ ప్రాంతంలో తీవ్రమైన కరువు సంభవించిందని, అప్పటి నుంచి ఆహార భద్రత బిల్లు కోసం ప్రయత్నిస్తే 2013కు సాధ్యపడిందన్నారు. ఆహారం పొందడం ప్రతి ఒక్కరికీ హక్కుగా లభించడం ఆనందదాయకమని చెప్పారు. ఆహార భద్రతకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే నీటి వృథాను అరికట్టి ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితి 2025 లోపల ప్రపంచంలో ఆకలి సమస్య లేకుండా చూడాలనే లక్ష్యం పెట్టుకుందని, ఈ లక్ష్యం మనదేశంలో ఏ మేరకు అమలవుతుందో వేచి చూడాల్సిందేనన్నారు.
అనంతరం సొసైటీ ఫర్ హంగర్ ఎలిమినేషన్ సంస్థ అధ్యక్షుడు వి.రాజగోపాల్ రచించిన ‘హంగర్ ఫుడ్ సెక్యూరిటీ, సోషియో ఎకనామిక్ సినారియో’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యాపీఠం వీసీ హరేకృష్ణ శతపతి మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ చేసిన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని చెప్పారు. శాసన సభ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న స్వామినాథన్
స్వామినాథన్ బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం అన్ని విధాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అవినీతిలేని సమాజం, సామాన్య జీవితం, ఆధ్మాత్మిక విలువలతో కూడిన జీవనమే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలన్నారు. అలాంటి మార్గంలో దేశం నడిచేలా చూడాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నానని చెప్పారు.