‘అమర్త్య సేన్‌కు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టిన అంశం?’ ఈ ప్రశ్నకు జనరల్ నాలెడ్జ్‌లో కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ‘సంక్షేమ అర్థ శాస్త్రం’ అని జవాబు చెబుతారు. కానీ మన ఘనత వహించిన ఏపీపీఎస్సీ మాత్రం ‘అంతర్జాతీయ వర్తకం’ సరైన సమాధానమంటుంది. ఆ జవాబు పేర్కొన్నవారికే మార్కులేస్తుంది. ఇప్పటికే తప్పుడు ‘కీ’లతో లక్షలాది ఉద్యోగార్థుల జీవితాలతో ఆడుకున్న కమిషన్ తాజాగా జూనియర్ లెక్చరర్స్ ఎకనామిక్స్ కీ లోనూ అదే పంథాలో వ్యవహరించింది. సరైన జవాబులి చ్చిన అభ్యర్థులు నిరుద్యోగులుగానే ఉండగా, తప్పుడు జవాబులిచ్చినవారు ఉద్యోగాల్లో చేరిపోయారు.
రెండేళ్ల తరువాత ఇచ్చిన కీ..
2008లో 1,100 జూనియర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ 2011 డిసెంబరు 3న రాత పరీక్ష నిర్వహించింది. వాటి ఫలితాలను 2012 జూన్‌లో ప్రకటించింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. సెప్టెంబరులో ఎంపిక జాబితాలను ప్రకటించింది. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించకముందే 93 ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సబ్జెక్టు పేపరులో (150 ప్రశ్నలకు 300 మార్కులు) మూల్యాంకనంలో అనుమానాలు ఉన్నాయని, తాము సరైన సమాధానాలు రాసినా మార్కులు రాలేదని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారులకు తెలిపారు. పలుమార్లు ఛైర్మన్‌ను కలిసి విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక 2012 సెప్టెంబరులో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశించినా ఏపీపీఎస్సీ మాత్రం ‘కీ’ని ప్రకటించలేదు. ఈలోపే తప్పుడు కీతోనే పోస్టింగ్‌లు కూడా ఇచ్చేసింది. దీంతో నష్టపోయిన అభ్యర్థులు గత సెప్టెంబరులో ధిక్కార పిటిషన్ దాఖలు చేయడంతో ఏపీపీఎస్సీకి ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. ట్రిబ్యునల్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టుకు వెళ్లిందే కానీ కీ మాత్రం ఇవ్వలేదు. చివరకు ఈనెల 2న జరిగిన విచారణ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థి దరఖాస్తు చేసుకుంటే కీ ఇస్తామంటూ కోర్టులో చెప్పింది. చివరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో శుక్రవారం కీని ఇచ్చింది.
60 తప్పులతో లబోదిబోమంటున్న అభ్యర్థులు
ఏపీపీఎస్సీ శుక్రవారం ఇచ్చిన కీలోని తప్పులను చూసి అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కలిగిన 60 ప్రశ్నలకు తప్పులనే సరైన సమాధానాలని పేర్కొందని, దాంతో 120 మార్కులు నష్టపోయామని చెబుతున్నారు. తప్పుడు సమాధానాలతో తమకు అన్యాయం చేసిందని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిందని వాపోతున్నారు.
‘ఎ’ సిరీస్ ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలకు ఏపీపీఎస్సీ ఇచ్చిన తప్పుడు సమాధానాలు..
భారత దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థాపనకు ఉపయోగపడిన మొదటి పారిశ్రామిక తీర్మానం.. అనే 130వ ప్రశ్నకు ఏపీపీఎస్సీ 1956 తీర్మానం అని ఇవ్వగా.. వాస్తవ సమాధానం 1948 పారిశ్రామిక తీర్మానం. తెలుగు అకాడమీ ముద్రించిన భారత ఆర్థిక వ్యవస్థ-సమస్యలు అనే పుస్తకం ఇందుకు ఆధారం.
పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంచనా వేయబడిన స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎన్‌పీ) అనే 8వ ప్రశ్నకు వాస్తవ సమాధానం 9 శాతం కాగా.. కీలో 8 శాతం అని ఇచ్చింది. తెలుగు అకాడమీ ముద్రించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఎకనామిక్స్ పుస్తకమే ఆధారం.
‘ది అప్లూయెంట్ సొసైటీ’ గ్రంథ రచయిత ఎవరు? అనే 9వ ప్రశ్నకు షూమేకర్ అని ఏపీపీఎస్సీ ఇవ్వగా... వాస్తవ సమాధానం జె.కె.గాల్‌బ్రిత్. ఇందుకు జాన్ కెన్నత్ గాల్‌బ్రిత్ పుస్తకమే ఆధారం. పుస్తకం కవర్‌పేజీపైనే అది ఉంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా అనే 149వ ప్రశ్నకు ఏపీపీఎస్సీ విశాఖపట్నం అని ఇవ్వగా సరైన సమాధానం హైదరాబాద్.
జూనియర్ లెక్చరర్ల 'కీ' తప్పులతడక!
Published Sun, Dec 15 2013 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement